Visakhapatnam: ట్రావెల్‌ బస్సు చోరీకి యత్నం.. ఇలా దొరికిపోయాడు!

16 Dec, 2021 09:00 IST|Sakshi
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రేన్‌ సహాయంతో బస్సును తరలిస్తున్న దృశ్యం

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): ద్విచక్ర వాహనాలు, ఆటోలను దొంగలించడం సర్వ సాధారణం. అయితే ఓ దొంగ ఏకంగా ట్రావెల్‌ బస్సునే చోరీకి యత్నించాడు. వివరాలిలా ఉన్నాయి. నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని సింధూర గెస్ట్‌హౌస్‌ పక్కన ట్రావెల్‌ బస్సును మంగళవారం రాత్రి డ్రైవర్‌ నిలిపి భోజనానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బస్సు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. అక్కడ అదృశ్యమైన బస్సు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో లభ్యమైంది. టౌన్‌కొత్తరోడ్డు వద్ద విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఉండడాన్ని స్థానికులు గుర్తించి, ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాఫిక్‌ ఎస్‌ఐ కాళిదాసు, అదనపు ఎస్సై గణేష్, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు క్రేన్‌ సహాయంతో బస్సును రోడ్డు పక్కకు తరలించారు. బస్సు ముందు భాగం నుజ్జు అయింది. బస్సును తస్కరించిన వ్యక్తి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి పరారై ఉంటాడని ట్రాఫిక్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: జంక్‌ సామ్రాజ్యం ‘సోటిగంజ్‌’.. చోర్‌ మాల్‌తో 30 ఏళ్ల దందా.. కోట్లకు కోట్లు వెనకేశారు

మరిన్ని వార్తలు