ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఏపీటీఎల్‌

6 Oct, 2020 08:26 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 5జీ టవర్లను నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్‌ టవర్స్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎల్‌) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోవిడ్‌–19 దెబ్బతో 5జీ సేవలు అందుబాటులోకి రావడానికి ఆలస్యం కానుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  తొలి దశలో కనీసం 2,000 టవర్లను  ఏదైనా ఒక భాగస్వామ్య సంస్థతో నిర్మించి వాటిని టెలికాం ఆపరేటర్లకు లీజుకు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏపీటీఎల్‌ ఎండీ ఆర్‌. పవనమూర్తి తెలిపారు.

భూమి లీజుదారులు, టెలికాం ఆపరేటర్ల మధ్య ఏపీటీఎల్‌ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తుందన్నారు. దీనివల్ల ఒకే టవర్‌ను అనేక ఆపరేటర్లు వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. కాగా, ఈ సంవత్సరాంతానికి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రావాల్సి ఉండగా..ప్రధాని మోదీ ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా చైనా పరికరాలు కాకుండా దేశీయ పరికరాలే వాడాలని పేర్కొనడంతో ఆలస్యమవుతోంది. ఇప్పటికే సీడాట్, టెక్‌ మహీంద్రా వంటి దేశీయ సంస్థలు సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. (తిరుపతి శిల్పారామానికి రూ.10 కోట్లు)

మరిన్ని వార్తలు