9 నుంచి ఇంజనీరింగ్‌ ప్రవేశాలు  | Sakshi
Sakshi News home page

9 నుంచి ఇంజనీరింగ్‌ ప్రవేశాలు

Published Tue, Oct 6 2020 8:24 AM

Engineering Admission Counseling Schedule Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి ఇంజనీరింగ్‌ ప్రవేశాలు చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. గతేడాది విధానంలోనే ఈసారి కూడా ప్రవేశా లు చేపట్టాలని నిర్ణయించారు. రెండు దశల కౌన్సెలింగ్‌ తరువాత వచ్చే నెల 4న స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నారు. స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలను https://tseamcet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటు లో ఉంచనున్నారు. నవంబర్‌ 5వ తేదీ నాటికి ప్రవేశాలు పూర్తయితే ఇంజనీరింగ్‌ తరగతులను నవంబర్‌ 10 లేదా 15వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 
(చదవండి: ‘అడ్వాన్స్‌డ్‌’లో తెలుగోళ్లు)

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 36 హెల్ప్‌లైన్‌ కేంద్రాలు 
కరోనా నిబంధనలు పాటిస్తూనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం 36 హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్ట నుంది. ప్రతి అర గంటకో స్లాట్‌ ఉండేలా కస రత్తు చేసింది. విద్యార్థులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌  సమయంలో హెల్ప్‌లైన్‌ సెంటర్, తేదీ, సమయాన్ని పేర్కొంటూ ఆన్‌లైన్‌ ద్వారానే స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా సమయాల్లో సంబంధిత హెల్ప్‌లైన్‌ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేసుకొనేలా కమిటీ ఏర్పాట్లు చేసింది. ప్రాసెసింగ్‌ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ. 600గా, ఇతర విద్యార్థులకు రూ. 1200గా నిర్ణయించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో బుధవారం అందుబాటులో ఉంచనుంది.
(చదవండి: డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు: సజ్జనార్‌)

Advertisement
Advertisement