వెలిగొండ పనుల వేగం పెంచండి

7 Nov, 2020 03:47 IST|Sakshi

ఆగస్టు నాటికి రెండో దశ పూర్తి చేయాల్సిందే

కార్యాచరణ ప్రకారమే పోలవరం పనులు

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ 

సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌లో 237 మీటర్ల మేర పని చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. ఫాల్ట్‌ జోన్‌ (మట్టి పొరలు) అడ్డురావడం వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందన్నారు. టన్నెల్‌ తవ్వకం పనులు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయని, టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ తొలగించే పనులు ఫిబ్రవరికి పూర్తవుతాయని చెప్పారు.

ఎట్టి పరిప్థితుల్లోనూ ఫిబ్రవరికి తొలి దశను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రెండో టన్నెల్‌ ఆగస్టు నాటికి పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఆలోగా ప్రాజెక్టు రెండో దశ ద్వారా నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాలకు నీటిని తరలించే పనులను వేగవంతం చేయాలని సూచించారు. నల్లమలసాగర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను దశలవారీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేసిన కార్యాచరణ మేరకు పోలవరం ప్రాజెక్టును డిసెంబర్, 2021 నాటికి పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.  

>
మరిన్ని వార్తలు