రాజధాని రైతుల వార్షిక కౌలు రూ.195 కోట్లు విడుదల

17 Jun, 2021 04:24 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న రాజధాని రైతులు

సాక్షి, అమరావతి/తాడికొండ: రాజధాని భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు మొత్తం రూ.195 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి బుధవారం ఉత్తర్వులిచ్చారు. 2020–21కి సంబంధించి రాజధాని రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు కోసం ఈ మొత్తాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం  
అమరావతిలో భూములిచ్చిన తమను చంద్రబాబు మోసం చేసినా ఇచ్చిన మాటకు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అక్కున చేర్చుకుని 2021–22 ఏడాదికి రూ.195 కోట్లను విడుదల చేయడంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం చేశారు.

రాజధాని పేరుతో చంద్రబాబు తమ వద్ద 33 వేల ఎకరాలు తీసుకుని నిలువునా ముంచారని, ఇప్పుడు హైదరాబాద్‌లో చేరి 29 గ్రామాల్లో రైతు కుటుంబాలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో బడా బాబులు, పారిశ్రామిక వేత్తలకు తమ భూములు దోచిపెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తుళ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆలోకం సురేష్, భూములిచ్చిన రైతులు నాయుడు నాగేశ్వరరావు, తుమ్మూరు ప్రకాశ్‌రెడ్డి, సుంకర శ్రీను, గుంతల నాగేశ్వరరావు, గడ్డం జయరామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు