-

ఎల్లో మీడియాకు ఇవేమీ కనిపించవు: సీఎం జగన్‌

4 Dec, 2020 12:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమూల్‌తో ఒప్పందం వల్ల మహిళలకు మేలు చేకూరుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పాల రైతులకు అదనంగా ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మాత్రం ఇవేమీ పట్టవని, అందుకే సభలో రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు తమ పార్టీ సభ్యులను పంపి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా సభలో సస్పెండ్‌ చేయించుకుని ఎల్లోమీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ఈనాడు పేపర్‌తో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని చురకలు అంటించారు. పెన్షన్ల అంశంపై సభలో వీడియో క్లిప్పింగ్‌లతో సహా చూపించినా.. చంద్రబాబు చెప్పే అసత్యాలను ప్రచురిస్తున్నారంటూ ఎల్లోమీడియా తీరును విమర్శించారు. బాబును కాపాడటానికి ఈనాడు, ఆంధ్రజోతి, టీవీ5 పనిచేస్తున్నాయని.. ఆయన సీఎం కాలేదన్న ఈర్ష్య, కడుపు మంటతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయంటూ ధ్వజమెత్తారు.(చదవండికావాలనే సభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు!)

2023లో రూ. 3 వేలకు పెంపు
పింఛన్ల గురించి సీఎం జగన్‌ సభలో మాట్లాడుతూ.. ‘‘2019, జనవరి 25న పింఛన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచారు. ఎన్నికలకు రెండు నెలల ముందు పింఛన్లను పెంచారు. ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రమే 6 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక 60 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాం. మేము రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే.. బాబు మాత్రం రూ.500 కోట్లే ఖర్చు చేశారు. ఈ వాస్తవాలన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు కనిపించడంలేదు. జూలై 8న రూ.2,250 నుంచి రూ.2500లకు పింఛన్‌ పెంచుతాం. 2022 జూలై 8న రూ.2,500 నుంచి రూ.2,750కి పింఛన్‌ పెంచుతాం. 2023 జూలై 8న రూ.2,750 నుంచి రూ.3 వేలకు పింఛన్‌ పెంచుతాం’’ అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు