బిల్లు తగ్గేలా ఇల్లు.. ఐఈఏ ప్రశంసలు

10 May, 2021 04:54 IST|Sakshi

ఏపీ గృహ నిర్మాణంలో అద్భుతం

సహజ వాతావరణమే శ్రీరామరక్ష

గాలి, వెలుతురు పుష్కలం

అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ అభినందన

ఏపీని ప్రశంసించిన ఐఈఏ ఎనలిస్ట్‌ మైఖేల్‌ అప్పర్‌మెన్‌

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద కుటుంబాల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 లక్షల ఇళ్ల నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తున్నారు. గాలి, వెలుతురు విరివిగా ప్రసరించేలా.. తక్కువ కరెంట్‌ బిల్లులు వచ్చేలా వీటిని డిజైన్‌ చేయడం ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ పథకం దేశంలోనే అతి పెద్దదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ప్రశంసించింది. దీనివల్ల ఏడాది పాటు 2.50 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని ఆ సంస్థ ప్రతినిధి మైకేల్‌ అప్పర్‌మెన్‌ తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనులు జూన్‌ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావించడంతో భవన నిర్మాణ మెటీరియల్, ప్రణాళిక వేగంగా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండో–స్విస్‌ బిల్డింగ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రాజెక్టు (బీఈఈపీ) నేతృత్వంలో ఇటీవల వెబినార్‌ జరిగింది. ఈ వివరాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ మీడియాకు ఆదివారం వివరించారు. 

అడుగడుగునా హై టెక్నాలజీ
స్విట్జర్లాండ్, భారత్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ ఆధ్వర్యంలోని ‘ఎనర్జీ ఎఫీషియెంట్, థర్మల్లీ కంఫర్టబుల్‌ (ఈఈటీసీ)’ టెక్నాలజీని ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం వాడుతోంది. దీనివల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రతలు కనీసం 2 డిగ్రీల వరకు తగ్గుతాయి. ఫలితంగా 20 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది. గాలి, వెలుతురు విరివిగా రావడం వల్ల సీజనల్‌ వ్యాధులు సోకేందుకు ఆస్కారం తక్కువ. పైకప్పు మీద  రూఫ్‌ ఇన్సులేషన్‌ లేదా రిఫ్లెక్టివ్‌ రంగు వేయడం ద్వారా వేడి తగ్గుతుంది. ఆటోక్లేవ్‌ ఏరేటెడ్‌ కాంక్రీట్‌ (ఏఏసీ) బ్లాక్స్, కేవిటీ వాల్, హేలో బ్రిక్స్‌ వంటివి వాడటం వల్ల మొత్తం భవనంపై వేడి తగ్గిపోతుంది. కిటికీలకు సరైన తెరలు వాడటం వల్ల కూడా బయటి వేడి లోపలకు రాకుండా ఉంటుంది. 

క్షేత్రస్థాయి వరకూ శిక్షణ 
ఇంజనీర్లు, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది, వార్డు, సచివాలయ సిబ్బందికి బీఈఈపీ, బీఈఈ సంయుక్తంగా తాజా సాంకేతికపై శిక్షణ ఇస్తోంది. 13 వేల మంది ఇంజనీర్లకు దశల వారీగా ఈ శిక్షణ ఉంటుంది. ఇండో–స్విస్‌ బీఈఈపీ, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కి),  రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, స్టేట్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ సీడ్కో ), ఇంధన శాఖ సహకారంతో శిక్షణ చేపడతారు. ప్రాథమికంగా 50 మంది ఇంజనీర్లకు ‘మాస్టర్‌ ట్రైనర్లు’గా శిక్షణ ఇస్తారు. అనంతరం వీరు మిగిలిన వారందరికీ శిక్షణ ఇస్తారు. తర్వాత 500 మంది గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందనడానికి ఇదే నిదర్శనమని అజయ్‌ జైన్‌ పేర్కొన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పథకంలో సీసీ రోడ్లు, నీటి సరఫరా, విద్యుదీకరణ, భూగర్భ డ్రైనేజీ తదితర సౌకర్యాల కోసం పంచాయతీరాజ్, మునిసిపల్, గ్రామీణ నీటి సరఫరా, ఇంధన శాఖలు రూ.32,215 కోట్లు ఖర్చు చేస్తాయని అంచనా వేసినట్టు తెలిపారు. 

విద్యుత్‌ షాక్‌ ఉండదు
పేదల కోసం నిర్మించే ఇళ్లల్లో ఇంధన సామర్థ్య పరికరాలు వాడుతున్నాం. దీనికి ఇంధన పొదుపు సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల రాష్ట్రంలో 20 శాతం కరెంట్‌ వృథాను అరికట్టే వీలుంది. పేదలకు అతి తక్కువ కరెంట్‌ బిల్లులు వచ్చే వీలుంది.      
– ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, సీఈవో, రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్‌  

మరిన్ని వార్తలు