దేశానికే రోల్‌ మోడల్‌గా ఏపీ ‘జీఐఎస్‌’

25 Mar, 2022 23:11 IST|Sakshi

ఇంధన శాఖ అనుసరిస్తున్న ‘జీఐఎస్‌’తో సమగ్ర సమాచారం

ఓవర్‌ లోడింగ్‌ తదితర వివరాల గుర్తింపు, పర్యవేక్షణ   

ఇక దక్షిణాది రాష్ట్రాల్లో పవర్‌ గ్రిడ్‌ పర్యవేక్షణకు ఏపీ మోడల్‌ 

వివరాలు తీసుకున్న సదరన్‌ రీజినల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ 

సాక్షి, అమరావతి: నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ క్రమంలోనే ఇంధన శాఖలో అనుసరిస్తున్న జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(జీఐఎస్‌) దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. దీనివల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్‌ చేయడం సులభతరమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌లో భాగమైన సదరన్‌ రీజినల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌.. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్‌ గ్రిడ్‌ల పర్యవేక్షణకు మన జీఐఎస్‌ మోడల్‌ను తీసుకుంది.  

సమగ్ర వివరాలు
మరుసటి రోజు విద్యుత్‌ వినియోగాన్ని అంచనా వేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌)ను ఉపయోగిస్తోంది. ప్రతి 15 నిమిషాలకు వివరాలు తెలుసుకుంటోంది. దీని వల్ల విద్యుత్‌ డిమాండ్, సరఫరా, గ్రిడ్‌ నిర్వహణ, విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడంపై సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుకలుగుతోంది. విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న ఏపీ ట్రాన్స్‌కో.. నెట్‌వర్క్‌ నిర్వహణ కోసం మాత్రం సొంతంగా జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది.

దీని ఆధారంగా రాష్ట్ర ఇంధన శాఖ మ్యాపింగ్‌ పవర్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోంది. సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ లైన్‌లు, ఫిజికల్‌ పొజిషన్‌ ఎలా ఉందనేది జీఐఎస్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. వినియోగదారుల నుంచి ఉత్పాదక స్టేషన్‌ల వరకూ మొత్తం ఏపీ నెట్‌వర్క్‌ గ్రిడ్‌ మ్యాప్‌ను రూపొందించడంలో జీఐఎస్‌ సాయపడుతోంది.

రియల్‌ టైమ్‌ ఓవర్‌ లోడింగ్, లైన్‌ల అండర్‌ లోడింగ్‌ గురించి తెలుసుకోవడం, అన్ని పవర్‌ కంపెనీల మొత్తం ఆస్తుల సరిహద్దుల మ్యాప్‌ను రూపొందించడం, ఖాళీగా ఉన్న భూమిని గుర్తించడం వంటి పనులు జీఐఎస్‌తో సాధ్యమవుతున్నాయి. ఇది ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌లను మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు సాయపడుతోందని ఇంధనశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రయోగాత్మకంగా..  
బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న సదరన్‌ రీజినల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌.. ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతాన్ని కలిపే మొత్తం దక్షిణ గ్రిడ్‌ సమగ్ర వ్యవస్థ వివరాలు తెలుసుకునేందుకు జీఐఎస్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. వాతావరణాన్ని అంచనా వేయడం, లోడ్‌ షెడ్యూలింగ్‌ చేయడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తించడం, లైన్ల పెట్రోలింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వంటి ప్రయోజనాలు జీఐఎస్‌ సిస్టమ్‌ ద్వారా పొందాలనుకుంటోంది. గ్రిడ్‌ మ్యాపింగ్‌లో భాగంగా రాష్ట్రంలోని 400 కేవీ, 220 కేవీ సబ్‌ స్టేషన్ల అన్ని టవర్‌ స్థానాల వివరాలను అందించాల్సిందిగా ఏపీ ట్రాన్స్‌కోను ఎల్‌ఆర్‌ఎల్‌డీసీ కోరడంతో అధికారులు ఆ వివరాలను ఇప్పటికే అందజేశారు.

మరిన్ని వార్తలు