YSR Pension: తొలి రోజే 88.92 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

1 Sep, 2021 20:50 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీని వాలంటీర్లు పలుచోట్ల జోరువానలోనూ కొనసాగించారు. తెల్లవారు జామునుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వాలంటీర్లు ప్రారంభించారు. కాగా,  ఏపీ వ్యాప్తంగా 59.18 లక్షల మంది పెన్షనర్ల కోసం రూ. 1382.62 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం 6.30 గంటల వరకు 88.92  శాతం పెన్షన్లు పంపిణీ చేశారు. మరో మూడు రోజుల్లో నూరు శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా వాలంటీర్ల సేవలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. ప్రతినెల ఒకటో తేదిన పెన్షన్లను లబ్ధిదారుల చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పెన్షన్‌ కానుకను ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా 2.66 లక్షల మంది వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్‌ సోమ్మును అందించారు. దీనిలో భాగంగా ఈరోజు సాయత్రం 6.30 గంటల వరకు 88.92 శాతం మందికి పెన్షన్‌ పంపిణీని పూర్తిచేశారు.

సెప్టెంబరు ఒకటో తేదిన సొమ్ము మొత్తం 59,18,685 మంది లబ్ధిదారుల చేతికి అందించేందుకు ముందురోజే సచివాలయాల స్థాయిలో కార్యదర్శుల ఖాతాలలో సోమ్మును ప్రభుత్వం జమచేసింది. బుధవారం సాయం‍త్రం వరకు 52,62,993 మంది లబ్ధిదారులకు 1228.77కోట్ల రూపాయల పెన్షన్ల పంపిణీని పూర్తిచేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి జిల్లా, మండల, పంచాయతీ స్థాయి అధికారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, పలు వ్యాధులతో బాధపడుతున్న వారిని సామాజికంగా, ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న కానుక .. ఎన్ని అవాంతారాలు ఎదురైన ప్రజలకు చేరాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. కాగా, ఈరోజు సాయత్రం వరకు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 91.96 శాతం​ పెన్షన్‌ పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 90.97 శాతం, పశ్చిమగోదావరిలో 90.93 శాతం పెన్షన్లను పంపిణీ చేశారు.

విజయనగరం జిల్లాలో 90.82, నెల్లూరు జిల్లాలో 90.49 శాతం, కృష్ణా జిల్లాలో 89.81,గుంటూరులో 88.75, అనంతపురం జిల్లాలో 88.48 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 87.87 శాతం, కర్నూలు జిల్లాలో 87.62 శాతం, శ్రీకాకుళంలో 87.07, ప్రకాశం జిల్లాలో 86.20 శాతం, విశాఖపట్నం జిల్లాలో 86.14 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యింది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపపిణీలో చూపిన నిబద్ధతను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అభినందించారు.  

చదవండి: అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్‌ అందిస్తున్నాం: సజ్జల

మరిన్ని వార్తలు