అమరావతి రైతులు: రూ. 158 కోట్లు విడుదల

27 Aug, 2020 11:48 IST|Sakshi

అమరావతి రైతుల వార్షిక కౌలు, పెన్షన్‌ విడుదల

సాక్షి, అమరావతి: అమరావతి ప్రాంత రైతులకు వార్షిక కౌలు, రెండు నెలల పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. వార్షిక కౌలు కింద రూ.158 కోట్లతో పాటు రెండు నెలల పెన్షన్‌ 9.73 కోట్లను ఆయా రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన అమరావతి రైతుల బ్యాంకు అకౌంట్లలో ఈ సొమ్ము జమ అవుతుందని పేర్కొన్నారు.(చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు)

సాంకేతిక సమస్యల వల్లే ఆలస్యం: బొత్స
సాక్షి, విజయనగరం: అమరావతిలో రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వలేదని ప్రజలకు రెచ్చగొడుతూ నిరసనకు దిగిన ప్రతిపక్ష నేతల తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బుధవారమే అర్హులైన రైతుల బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ చేశామని... అయితే కొన్ని సాంకేతిక సమస్యల వల్లే ఆలస్యం జరిగిందని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసి కూడా ప్రతిపక్ష నాయకులు రైతులను రెచ్చగొడుతున్నరని మండిపడ్డారు. అదే విధంగా భూహక్కు పత్రాలను అమ్ముకున్న రైతులకి కౌలు చెల్లింపులు జరగవని బొత్స ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇందుకు సంబంధించిన సర్వే జరుగుతోందని.. అదే విధంగా అమరావతి కౌలు రైతులకు పెన్షన్ ఐదువేల రూపాయిలకి పెంచాలని ప్రభుత్వం భావించిందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు కోర్టుకు వెల్లడంతో సాధ్యపడలేదన్నారు. అందుకే ఈ దఫా 2500 రూపాయలే చెల్లించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇక 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ... పట్టాలను పంపిణీ చేయకుండా ప్రతిపక్షం కోర్టుకు వెళ్లి అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారికి లబ్ది చేకూరేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని.. దయచేసి వాటికి అడ్డు పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమ పథకాలకు అడ్డుపడితే.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

అమరావతి రైతులకు ప్రయోజనాలు
గత టీడీపీ సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమరావతి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పరిహార భృతిని(పెన్షన్‌) రూ.2,500 నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచింది. దీనివల్ల అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 20,100 మంది భూమి లేని కూలీలకు లబ్ధి చేకూరనుంది. (చదవండి: అమరావతి రైతులకు వరాలు)

ఇక ఈ పెన్షన్‌ పెంపువల్ల ప్రభుత్వ ఖజానాపై అదనంగా నెలకు రూ.5.2 కోట్లు, ఏడాదికి రూ.60.30 కోట్ల భారం పడనుంది. 29 గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వనున్నట్లు సీఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్నారు.రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రాంతీయ సమానాభివృద్ధి దిశగా పరిపాలన వికేంద్రీకరణకు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు