AP: అవ్వాతాతల పింఛను రూ.3వేలకు పెంపు

15 Dec, 2023 07:47 IST|Sakshi

తుది ఆమోదం కోసం నేటి కేబినెట్‌ సమావేశం ముందుకు..

పెరిగిన పింఛను జనవరి నుంచి ఇస్తామని గతంలోనే సీఎం జగన్‌ ప్రకటన

ఇప్పడు ప్రతినెలా 65.33 లక్షల మందికి రూ.1,800 కోట్లు పంపిణీ 

పెంపు తర్వాత పింఛన్ల వ్యయం రూ.2 వేల కోట్లకు పెరుగుదల 

చంద్రబాబు హయాంలో నెలనెలా పెట్టిన ఖర్చు రూ.400 కోట్లే..

గ్రామాల్లో ఇంటింటికీ  మంచినీటి కుళాయిల ఏర్పాటు పనులు పొదుపు మహిళలకు..

మంత్రివర్గ భేటీలో చర్చ జరిగే అవకాశం

సాక్షి, అమరావతి: అవ్వాతాతలతో పాటు వితంతు, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. వీరికి ప్రతినెలా ఇచ్చే సామాజిక పింఛను మొత్తాన్ని రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల తుది ఆమోదం ఫైలు శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది.

నిజానికి.. 2024 జనవరి నుంచి పింఛన్‌ మొత్తాన్ని రూ.3,000కు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి నెలన్నర క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800 కోట్లకు పైగా ఖర్చుచేస్తుండగా.. జనవరి నుంచి జరిగే పెంపు అనంతరం అది దాదాపు రూ.2,000 కోట్లకు పెరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,33,781 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందారు.

బాబు జమానాలో అవస్థలే..
వాస్తవానికి.. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అవ్వాతాతల పింఛన్ల కోసం సరాసరిన ప్రతి­నెలా పెట్టిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు మాత్ర­మే. అలాగే, అప్పట్లో అర్హత ఉన్న వారికి కొత్తగా పింఛను మంజూరు కావాలన్నా.. మంజూరైన పింఛను ప్రతినెలా తీసుకోవాలన్నా లబ్ధిదా­రుల అవస్థలు అంతాఇంతా కాదు. ఆ తర్వాత.. అంటే నాలుగు­న్నర ఏళ్ల క్రితం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాజిక పింఛను­దారులకు స్వర్ణయుగమే అని చెప్పాలి.

ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న ప్రతి పది మందిలో దాదాపు నలుగు­రికి వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాకే కొత్తగా పింఛన్లు మంజూరైన­వే­నని.. ఈ కాలంలో 28,26,884 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేద­రిక నిర్మూ­లన సంస్థ (సెర్ప్‌) అధికారులు వివరి­స్తున్నారు. మరోవైపు.. పింఛన్ల పంపిణీలో జగన్‌ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రతీనెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ మధ్య ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు పొద్దున్నే వెళ్లి పింఛను డబ్బులు అందజేసే విధానానికి శ్రీకారం చుట్టారు.

పొదుపు మహిళలకు మంచినీటి కుళాయి ఏర్పాటు పనులు..
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిల ఏర్పాటుచేసే మరో కీలక కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ పనులను ఇప్పుడు కొత్తగా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్‌ సిస్టమ్‌ (సీసీఎస్‌)లో ఆయా గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళలతో కూడిన కమిటీలకే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమిటీలను గ్రామ జలసంఘం పేరుతో పిలుస్తారు.

దీనికి సంబంధించి ప్రతిపాదనల ఫైలు కూడా శుక్రవారం నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశ­ముందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రి­యలో.. మహిళా కమిటీలపై ఎలాంటి ముందస్తు ఆర్థిక భారంపడే అవకాశం లేకుండా.. ఈ పనులకు అవసరమైన పైపులైన్లు, కుళాయి సామాగ్రిని ప్రభుత్వమే ముందుగా ఆ కమిటీలకు ఇచ్చే  అవకా­శముందని అధికారులు వివరిస్తున్నా­రు.

ఇదీ చదవండి: పేదల చదువులపై పిచ్చి ప్రేలాపనలు

>
మరిన్ని వార్తలు