‘రెమ్‌డెసివిర్‌’ల బ్లాక్‌మార్కెట్‌పై నిఘా

12 May, 2021 04:08 IST|Sakshi

ప్రభుత్వాస్పత్రుల్లోని కొందరు కిందిస్థాయి సిబ్బంది చేతివాటం

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను అడ్డదారిలో మెడికల్‌ షాపులకు విక్రయిస్తున్న వైనం

ప్రభుత్వాధికారుల తనిఖీల్లో వెల్లడి

రెమ్‌డెసివిర్‌ ఖాళీ సీసాల్లో సెలైన్‌ నింపి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

సాక్షి, అమరావతి: రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. తమకు వస్తున్న ఫిర్యాదులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఔషధ నియంత్రణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ తనిఖీల్లో పలు విషయాలు బయటపడ్డాయని అధికారులు పేర్కొన్నారు. పలుచోట్ల ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు కిందిస్థాయి సిబ్బందే రెమ్‌డెసివిర్‌లు ఎత్తుకెళ్లి.. ప్రైవేటు మెడికల్‌ షాపులకు అమ్ముతున్నట్టు తేలిందన్నారు. అనంతపురం జిల్లాలో 16 రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను పెద్దాసుపత్రిలోని ఇద్దరు సిబ్బంది తీసుకెళ్లి.. రెండు మెడికల్‌ షాపులకు విక్రయించగా అధికారులు పట్టుకున్నారు. గుంటూరులోనూ ఆస్పత్రి సిబ్బంది బయట అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లోని అన్ని వార్డుల్లో నిఘా పెంచినట్టు ఔషధ నియంత్రణ శాఖ పేర్కొంది. కొందరు ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు అధికారుల ద్వారా తెలిసింది. 

ఖాళీ బాటిళ్లు సేకరించి సెలైన్‌ నింపి.. 
మార్కెట్లోకి నకిలీ రెమ్‌డెసివిర్‌లు కూడా వచ్చినట్టు ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం అందింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో వాడిన ఒరిజినల్‌ రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల ఖాళీ బాటిళ్లను సేకరించి.. మూతను గమ్‌తో అతికించి తిరిగి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇందులో సెలైన్‌ లేదా డిస్టిల్డ్‌ వాటర్‌ నింపుతున్నట్టు సమాచారం. వీటిని స్టాఫ్‌ నర్సులు గానీ, డాక్టర్లు గానీ కొద్దిగా పరిశీలిస్తే.. నకిలీవో, ఒరిజినల్‌వో తెలుసుకోవచ్చని ఔషధ నియంత్రణ శాఖ తెలిపింది. ఒరిజినల్‌ ఇంజెక్షన్‌కు అయితే అల్యూమినియంతో మెషిన్‌లో చేసిన క్లోజ్డ్‌ ప్యాకింగ్‌ ఉంటుందని, నకిలీకైతే గమ్‌తో అతికించినట్టు కనిపిస్తుందని చెప్పారు. ఇంజెక్షన్లు వేసే నర్సులు, వైద్యులు వీటిపై అప్రమత్తంగా ఉండాలని డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం అధికారులు సూచించారు. 

ప్రతి ఆస్పత్రిపైనా నిఘాపెట్టాం 
ప్రతి ఆస్పత్రిపైనా, మెడికల్‌ షాపుపైనా నిఘా పెట్టాం. రెమ్‌డెసివిర్‌లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించినా.. అడ్డదారిలో వాటిని షాపులు కొన్నట్లు వెల్లడైనా తక్షణమే లైసెన్సులు రద్దు చేస్తాం. నిందితులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. 104కు ఫిర్యాదు చేసినా లేదా డ్రగ్‌ కంట్రోల్‌ విభాగానికి ఫిర్యాదు చేసినా తక్షణమే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.  
– రవిశంకర్‌ నారాయణ్, డైరెక్టర్‌ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ   

మరిన్ని వార్తలు