మోడల్‌ స్కూళ్లలో 282 టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

6 Aug, 2022 11:12 IST|Sakshi

71 టీజీటీ, 211 పీజీటీ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ 

కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు 

ఈ నెల 8 నుంచి 17 వరకు దరఖాస్తులు 

ఆగస్టు 30 నుంచి టీచింగ్‌ డెమో 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో 282 టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో 71 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), 211 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులున్నాయి. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా  ఎంపికచేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జోన్ల వారీగా సెలెక్షన్‌ కమిటీల ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి. టీజీటీ పోస్టులు జోన్‌ 1లో 17, జోన్‌ 3లో 23, జోన్‌ 4లో 31 ఉండగా పీజీటీ పోస్టులు జోన్‌ 1లో 33, జోన్‌ 2లో 4, జోన్‌ 3లో 50, జోన్‌ 4లో 124 ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ‘హెచ్‌టీటీపీఎస్‌://సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాలి. ఇటీవలి పాస్‌పోర్టు సైజు ఫొటో, స్పెసిమన్‌ సిగ్నేచర్‌ స్కాన్డ్‌ కాపీలను స్పష్టంగా కనిపించేలా అప్‌లోడ్‌ చేయాలి. అభ్యర్థులకు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు. పీజీటీ పోస్టులకు రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పీజీటీ కామర్స్‌ పోస్టులకు ఎం.కామ్‌ అప్లయిడ్‌ బిజినెస్‌ ఎకనమిక్స్‌ చేసిన వారు అర్హులు కారు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు లేదా యూజీసీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ కోర్సు పూర్తి చేసి 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

సంబంధిత సబ్జెక్టులలో బీఈడీ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతలు, వెయిటేజీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పొందుపరిచింది.  ఎంపికల అనంతరం నిబంధనల ప్రకారం అభ్యర్థులు నిర్ణీత కాంట్రాక్టు ఒప్పందాలను పూర్తిచేశాక నియామకాలు పొందుతారు. ఎప్పుడైనా డీఎస్సీ ద్వారా రెగ్యులర్‌ టీచర్లు నియామకమైతే వీరి కాంట్రాక్టు ఆటోమేటిగ్గా రద్దు అవుతుంది.

మరిన్ని వార్తలు