భూముల రీ సర్వేకు జాతీయస్థాయి ప్రశంస 

18 Oct, 2023 04:23 IST|Sakshi

భూహక్కు–భూరక్ష సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ధర్మాన  

రెండు దశల్లో ఇప్పటి వరకు 4 వేల గ్రామాల్లో సర్వే పూర్తి 

వచ్చే ఏడాది జనవరి నాటికి మూడో దశ సర్వే పూర్తి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న భూ సమ స్యలన్నింటినీ పరిష్కరించే లక్ష్యంతో  చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియకు జాతీయస్థాయిలో ప్ర శంసలు లభిస్తున్నాయని మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల రీ సర్వేను అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం జగనన్న భూహక్కు–భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది.

మంత్రులు మాట్లాడుతూ ఇటీవలే కేంద్ర కార్యదర్శి, అడిషనల్, జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారులతోపాటు 5 రాష్ట్రాల నుంచి సర్వే విభాగానికి సంబంధించిన కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించి,  భూముల రీ సర్వే విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. మొదటి, రెండు దశల్లో మొత్తం 4 వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, భూ హక్కు పత్రాలను పంపిణీ చేసినట్లు అధికారులు మంత్రుల కమిటీకి వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 13,072 గ్రామాల్లో డ్రోన్‌ ఫ్లైయింగ్‌ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 9 వేల గ్రామాలకు డ్రోన్‌ ఇమేజ్‌లను పంపించినట్లు చెప్పారు. మూడో దశకు సంబంధించి ఇప్పటికే 360 గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లోనూ సర్వే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. నాలుగు మున్సిపల్‌ ఏరియాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, హక్కు పత్రాలను అందించాలనే లక్ష్యం మేరకు పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. 

మూడో దశ సర్వేను వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మైనింగ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ కమిషనర్‌ సిద్దార్థ్‌ జైన్, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ సూర్యకుమారి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు