ముంపు ముప్పు ఉండదిక

15 Apr, 2021 03:35 IST|Sakshi

పట్టణాల్లో రూ.350.75 కోట్లతో వరద కాలువల నిర్మాణానికి ప్రణాళిక

118 కిలోమీటర్ల మేర 14 కాలువల నిర్మాణానికి ఆమోదం

సాక్షి, అమరావతి: వర్షాకాలంలో ముంపు నుంచి పట్టణాలను రక్షించేందుకు పురపాలక శాఖ సమాయత్తమైంది. భారీ వర్షాలకు జనావాసాలు జలమయమై ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్న దుస్థితికి చెక్‌ పెట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. పట్టణాలు కొన్ని దశాబ్దాలుగా ప్రణాళికా రహితంగా విస్తరించడంతో చిన్న చిన్న వాననీటి కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. భారీ వర్షాలు వస్తే నీటి ప్రవాహానికి మార్గం లేక జనవాసాలు ముంపునకు గురవుతుండటం పరిపాటిగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పట్టణ ప్రాంతాల్లో వరద నీటి కాలువలు నిర్మించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. రూ.350 కోట్లతో రెండు దశల్లో 14 మునిసిపాలిటీలలో కాలువల్ని నిర్మించనుంది. అనంతరం దశలవారీగా లక్ష నుంచి 3 లక్షల జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లోనూ ఈ కాలువలు నిర్మించాలని నిర్ణయించింది. 

మొదటి దశలో 7 కార్పొరేషన్లలో..
లక్ష నుంచి 3 లక్షల జనాభా గల 32 నగరాలను అమృత్‌ పథకం పరిధిలోకి చేర్చారు. తాగునీటి సరఫరా, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, సివరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్ల నిర్మాణం మొదలైనవి చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం రూ.3,762.91 కోట్ల ప్రాజెక్టు ఇది. అందులో కేంద్రం వాటా రూ.1,056.62 కోట్లు కాగా.. రాష్ట్ర వాటా రూ.436.97 కోట్లు. మునిసిపల్‌ కార్పొరేషన్లు/ మునిసిపాలిటీల వాటా రూ.2,088.55 కోట్లు. ఈ నిధులతో చేపట్టే పనుల్లో 14 పట్టణాల్లో వరద కాలువల నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. అందుకోసం రూ.350.75 కోట్లతో 118 కిలోమీటర్ల మేర వరద నీటి కాలువల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొదటి దశలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం నగరాలను ఎంపిక చేసి పనులను మొదలు పెట్టింది. రెండో దశ కింద మిగిలిన 7 మునిసిపాలిటీలను త్వరలో ఎంపిక చేస్తారు. ఈ పనులను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. 

మూడేళ్లలో 32 మునిసిపాలిటీల్లో..
లక్ష నుంచి 3 లక్షల జనాభా ఉన్న అన్ని మునిసిపాలిటీల్లోనూ వరద కాలువలు నిర్మిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి.. మరో 14 మునిసిపాలిటీలను ఎంపిక చేయనుంది. మూడేళ్లలో మొత్తం 32 మునిసిపాలిటీల్లో కాలువల నిర్మాణం పూర్తి చేయాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. అత్యంత ప్రాధాన్య  అంశంగా ఈ పనులు చేపట్టామని పురపాలక శాఖ ఈఎన్‌సీ చంద్రయ్య చెప్పారు. 

నీటి వనరులతో అనుసంధానం
వర్షపు నీరు జనావాసాల్లోకి చేరకుండా నేరుగా ఈ కాలువల్లోకి చేరేలా డిజైన్లు రూపొందించారు. మునిసిపాలిటీ పరిధిలోని ఎత్తు ప్రదేశం నుంచి నేరుగా శివారు ప్రాంతానికి అనుసంధానిస్తూ భారీ కాలువలు నిర్మిస్తారు. ఆ కాలువలను మునిసిపాలిటీకి సమీపంలో ఉన్న నదులు/సముద్రం /ఇతర నీటి వనరులకు అనుసంధానిస్తారు. దాంతో ఎత్తు ప్రదేశాల నుంచి వర్షపు నీరు వేగంగా కిందకు ప్రవహించి నిర్దేశిత గమ్యానికి చేరుకుంటుంది.  

మరిన్ని వార్తలు