పంటనష్టమొచ్చిందని కౌలు రైతు దంపతుల ఆత్మహత్య 

11 Oct, 2023 04:21 IST|Sakshi

అనాథలైన చిన్నారులు 

మంథని (పెద్దపల్లి జిల్లా): ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలతో పంటలు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతు దంపతులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామపంచాయతీ పరిధి నెల్లిపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కటుకు అశోక్‌ (35), సంగీత (28) దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాయి (5), కూతురు సన (4) ఉన్నారు. గ్రామ శివారులో ఐదెకరాల వ్యవసాయభూమిని కౌలు తీసుకుని రెండెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి వేశారు.

వ్యవసాయ పనులు లేనిసమయాల్లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. పెట్టుబడి కోసం తెచ్చిన ఈ అప్పులు తీర్చేదారిలేకపోవడంతో మనస్తాపం చెందిన దంపతులు...సోమవారం రాత్రి పురుగుమందు తాగారు. మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించగా దంపతులిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, వీరి మృతితో అనాథలైన చిన్నారులు తమ తల్లిదండ్రులకు ఏమైందో తెలియక దిక్కులు చూస్తున్న దృశ్యం గ్రామస్తులను కలచివేసింది.

మరిన్ని వార్తలు