వినియోగంలోకి విస్తరించిన అప్రాన్‌

29 Jan, 2023 05:12 IST|Sakshi
విస్తరించిన అప్రాన్‌లో పార్కింగ్‌ చేస్తున్న ఇండిగో విమానం

ఈ నెల 26న ప్రారంభించిన ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి   

విమానాశ్రయం(గన్నవరం): విజయ­వాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో సుమారు రూ.32 కోట్లతో నూతనంగా నిర్మించిన అప్రాన్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంతరెడ్డి ప్రారంభించారు. ఈ అప్రాన్‌లోకి తొలిసారిగా పార్కింగ్‌ చేసిన హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి ఎయిర్‌పోర్ట్‌ అగ్నిమాపక శాఖ వాటర్‌ క్యానన్‌ సెల్యూట్‌ పలికింది.

విస్తరించిన కొత్త అప్రాన్‌లో ఆరు ఎయిర్‌బస్‌ ఎ321 విమానాలను పార్కింగ్‌ చేసుకునే సదుపాయం ఉంది. అంతే కాకుండా కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నుంచి ఆరు ఏరో బ్రిడ్జిల ద్వారా నూతన అప్రాన్‌ను అనుసంధానించనున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఏరో బ్రిడ్జిల ద్వారా నేరుగా విమానాల్లోకి రాకపోకలు సాగించవచ్చు. భవిష్యత్‌ అవసరాల నిమిత్తం విస్తరించిన భారీ అప్రాన్‌ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడం విమానాశ్రయ చరిత్రలో మరో మైలురాయి అని ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు. 

ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ నుంచి బస్‌ సర్వీస్‌లు...  
అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌ నుంచి విజయవాడ మీదుగా ఈ నెల 30వ తేదీ నుంచి గుంటూరు వరకు ఆర్టీసీ బస్‌ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు శనివారం ఆర్టీసీ అధికారులు ఎయిర్‌పోర్ట్‌ నుంచి గుంటూరు వరకు ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లేందుకు గాను ఈ సర్వీస్‌ను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం వేళ ఈ బస్‌ సర్వీస్‌ నడపనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఈ సర్వీస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు