బోడికొండపై 'దండు'యాత్ర..

23 Dec, 2021 03:27 IST|Sakshi
విజయనగరం జిల్లా రామతీర్థం కోదండ రామస్వామి ఆలయ శిలాఫలకాన్ని తోసేస్తున్న టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజు

కోదండ రామయ్య కోవెల పనులపై అశోక్‌ గజపతి ఆగ్రహం

రామతీర్థంలో అనుచరులతో కలసి వీరంగం.. శిలాఫలకాన్ని శిథిలం చేసే యత్నం 

అడ్డుకున్న సిబ్బంది, ప్రజాప్రతినిధులపై చిందులు

వైభవంగా ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన

దేవదాయ శాఖ నిధులతో కాకుండా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే శ్రీకారం

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రులు వెలంపల్లి, బొత్స హాజరు

సాక్షి ప్రతినిధి, విజయనగరం, నెల్లిమర్ల/నెల్లిమర్ల రూరల్‌: రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండరామ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్‌ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించారు. ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. 

స్వయంగా ఆహ్వానించినా..
రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్ల వ్యయంతో రామతీర్థం ఆలయ అభివృద్ధికి సంకల్పించినట్లు మంత్రులు వెలంపల్లి, బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. దేవదాయ శాఖ నిధులతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఖర్చుతోనే రూ.3 కోట్లతో బోడికొండపై కోదండరామస్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు రూ.కోటి వ్యయంతో దిగువనున్న రామస్వామి ఆలయ అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అశోక్‌ గజపతిరాజు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రోటోకాల్‌ ప్రకారం శిలాఫలకంపై ఆయన పేరు ఉన్నప్పటికీ కూలదోసేందుకు ప్రయత్నించారన్నారు. ఆలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులపైనా అనుచిత ప్రవర్తన తగదని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని దేవదాయశాఖ అధికారులు స్వయంగా ఆయన్ను కలిసి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఆ సమయంలోనూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

ఇదేనా విజ్ఞత?
దేవదాయ శాఖను సర్కస్‌ కంపెనీ అని హేళన చేయడమేనా ఆయన విజ్ఞత? అని మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. ధర్మకర్తగా ఉన్న ఆయన టీడీపీ హయాంలో ఒక్క రూపాయైనా ఆలయ అభివృద్ధికి వెచ్చించారా? అని ప్రశ్నించారు. విగ్రహాల తయారీకి విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చినా ఆ బాధ్యతను టీటీడీ తీసుకున్నందున తిరస్కరించామని తెలిపారు. ఆలయ అభివృద్ధి పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పునర్నిర్మాణ పనులకు విరాళం ఇవ్వవచ్చని సూచించారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ భూములను దోపిడీ చేసిన అశోక్‌ గజపతిరాజు ఆ డబ్బుతో ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. ఆయనది నీచమైన, క్రిమినల్‌ మనస్తత్వమని విమర్శించారు. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నామని, రాచరికపు ఆలోచనల నుంచి బయటకు రావాలని హితవు పలికారు. గతేడాది కోదండ రామ ఆలయంలో చోటుచేసుకున్న విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అది పూర్తయ్యాక దోషులెవరో తేలుతుందని చెప్పారు. 

అంగరంగ వైభవంగా..
రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం అర్చక స్వాములు శంకుస్థాపన ఘట్టాన్ని నిర్వహించారు. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్షేన, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, అష్టకలశ స్నపనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టి శంకుస్థాపన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. నూతన రాతి శిలలకు పూజలు, అభిషేకాలు చేశారు. చతుర్వేదాల ఆవాహన అనంతరం ముహూర్తం ప్రకారం ఉదయం 10.08 గంటలకు డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నూతన శిలా ఖండాలకు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. 

ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు...
బోడికొండ దిగువన ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రాతఃకాలార్చన, బాల భోగం అనంతరం యాగశాలలో ప్రత్యేక హోమాలు జరిపారు. స్వామి వెండి మండపం వద్ద నిత్యకల్యాణం, పట్టాభిషేక మహోత్సవం జరిగాయి. 

హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు
కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీలు డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, రామాలయ ఈవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు