AP: విమానయానం రయ్‌ రయ్‌..

8 Nov, 2021 07:44 IST|Sakshi

రాష్ట్రంలో కోవిడ్‌ పూర్వపు స్థితికి దేశీయ విమాన సర్వీసులు

ఈ ఏడాది ఆరు నెలల్లో  159 శాతం పెరిగిన ప్రయాణికుల సంఖ్య 

ఆరు విమానాశ్రయాల నుంచి 11.83 లక్షల మంది ప్రయాణం 

ఇదే సమయంలో 75 శాతం పెరిగిన విమాన సర్వీసులు 

ఆరు నెలల్లో రాష్ట్రం నుంచి 14,010 సర్వీసులు

ప్రయాణికుల వృద్ధిలో  తిరుపతి ముందంజ 

ఆ తర్వాతి స్థానాల్లో విశాఖ, విజయవాడ.. విశాఖ నుంచి కొత్త నగరాలకు పెరిగిన సర్వీసులు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమానయాన రంగం కోవిడ్‌ పూర్వపు స్థితికి చేరుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో విమాన ప్రయాణీకుల సంఖ్యలో 159.11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ సర్వీసుల సంఖ్యలో 75.51 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి గడిచిన ఆర్నెల్ల కాలంలో 11,88,673 మంది ప్రయాణించారు. గత ఏడాది ప్రయాణించిన 4,58,738 మందితో పోలిస్తే ప్రయాణికుల సంఖ్యలో 159 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో విమాన సర్వీసులు సంఖ్య 7,982 నుంచి 14,010కు పెరిగింది.

చదవండి: చిరకాల స్వప్నం నెరవేరింది..: ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ హర్షం

అంతర్జాతీయ సర్వీసులపై ఇంకా ఆంక్షలు ఉండటంతో విదేశీ సర్వీసులు సంఖ్య నామమాత్రంగానే ఉన్నాయి. కానీ, ఇదే సమయంలో దేశీయ సర్వీసులు మాత్రం కోవిడ్‌ ముందు స్థితికి చేరుకోవడమే కాకుండా కొత్త సర్వీసులు కూడా పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కోవిడ్‌కు ముందు విశాఖకు అంతర్జాతీయ సర్వీసులతో కలిపి రోజుకు 80 వరకు విమానాల రాకపోకలు ఉండగా ఇప్పుడిది 62 వరకు చేరుకుందని విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ కేఎస్‌ రావు ‘సాక్షి’కి తెలిపారు. ఒక్కసారి అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు తొలగిపోతే ఈ సర్వీసుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

తిరుపతికి పెరిగిన డిమాండ్‌ 
ఇక రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లోకెల్లా తిరుపతికి డిమాండ్‌ బాగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో తిరుపతి ప్రయాణికుల సంఖ్యలో 262.59 శాతం, సర్వీసుల సంఖ్యలో 205.78 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది మొదటి ఆరు నెలల్లో 59,129 మంది ప్రయాణించగా ఇప్పుడా సంఖ్య ఏకంగా 2,14,400కు చేరింది. ఇదే సమయంలో విమాన సర్వీసుల సంఖ్య 1,002 నుంచి 3,064కు చేరింది. కోవిడ్‌ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనాలపై ఆంక్షలు తొలగించడమే ప్రయాణికుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఇప్పటికే స్పైస్‌జెట్‌ ఢిల్లీ నుంచి తిరుపతికి నేరుగా సర్వీసు ప్రారంభించగా ఇండిగో డిసెంబర్‌ 15 నుంచి విశాఖ–తిరుపతి సర్వీసును ప్రారంభించనుంది. డిమాండ్‌ పెరుగుతుండడంతో మరిన్ని పట్టణాల నుంచి తిరుపతికి సర్వీసులను పెంచే యోచనలో విమానయాన సంస్థలున్నాయి. మరోవైపు.. తిరుపతి తర్వాత విశాఖ విమాన సర్వీసులకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. గడిచిన ఆరు నెలల కాలంలో విశాఖ నుంచి 5,861 సర్వీసుల ద్వారా 2,14,400 మంది ప్రయాణించారు. కొత్తగా ప్రారంభమైన కర్నూలు విమానాశ్రయం ద్వారా ఆరు నెలల్లో 14,224 మంది ప్రయాణించారు.

మరిన్ని వార్తలు