టీడీపీ నేత అయ్యన్న తనయుడి రచ్చ రచ్చ..

8 Mar, 2021 11:23 IST|Sakshi
రోడ్డు మీద  పడుకొని నిరసన తెలియజేస్తున్న చింతకాయల విజయ్‌ 

 రేషన్‌ పంపిణీకి ఆటంకాలు

ఏవగించుకుంటున్న ప్రజలు

విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. టీడీపీ నేతలకు కాళ్లు చేతులు ఆడట్లేదు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌కు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు నర్సీపట్నం ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అందుకే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌.విజయ్‌ ఆదివారం మార్చి నెలకు సంబంధించి నిత్యావసరాల పంపిణీని అడ్డుకున్నారు. దురుద్దేశంతో ఆటంకం కలిగించారు. 26వ వార్డులో ఎప్పటి మాదిరిగానే వాహనదారుడు సరకులు పంపిణీ చేస్తుండగా విజయ్‌ అనుచరులు వ్యాన్‌ దగ్గరకు వెళ్ళి  పంపిణీని అడ్డుకుని వ్యాన్‌ను మున్సిపల్‌ కార్యాలయానికి తరలించారు. డ్రైవర్‌ వద్ద ఉన్న రూ.10 వేల గురించి గొడవ చేశారు.

అది నాలుగు రోజుల నుంచి నిత్యావసర సరుకులు అమ్మగా వచ్చిన సొమ్మని వ్యాన్‌ డ్రైవర్‌  పోలీసులకు వివరించారు. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పినప్పటికీ సంతృప్తి చెందని విజయ్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద నాటకీయ పరిణామాలకు తెర తీశారు. అధికారులు సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. కొందరు వ్యక్తులు తమ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగాలని చూస్తున్నారని, ఎవరెన్ని  కుట్రలు పన్నినా 26వ వార్డులో తన తల్లి పద్మావతి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆవేశంతో ఊగిపోయారు.   పోలీసులు, మున్సిపల్‌ కమిషనర్‌పై విరుచుకుపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా రోడ్డు మీద పడుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకొని  ఉపన్యసించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వైఎస్సార్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎలక్షన్‌లో ఎవరి వ్యూహాలు వారివి.. దీన్ని ఇంత రచ్చ చేయడం అనవసరమని పట్టణ ప్రజలు చర్చించుకున్నారు. 

పట్టణ సీఐ హామీతో ఆందోళన విరమించిన అయ్యన్న
పట్టణ సీఐ స్వామినాయుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ హామీ ఇచ్చినా చాలని అయ్యన్నపాత్రుడు పేర్కొనడంతో సీఐ స్వామినాయుడు మైక్‌ తీసుకుని మాట్లాడారు. ఈ నెల 10న జరగనున్న ఎన్నికల్లో పట్టణ ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు వేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇవ్వడంతో అయ్యన్నపాత్రుడు ఆందోళన విరమించారు.
చదవండి:
ఎంపీ కేశినేనిని దూరంపెట్టిన చంద్రబాబు..
పాచి పనులకు పోతారా?

మరిన్ని వార్తలు