అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి

11 May, 2021 05:15 IST|Sakshi

ఉదయం 9 నుంచి 12 వరకు మాత్రమే బ్యాంకు సేవలు

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ వెల్లడి   

సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్, కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకింగ్‌ సేవలను మంగళవారం నుంచి సవరిస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రంలోని బ్యాంకింగ్‌ వేళలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరిమితం చేసింది. బ్యాంకుల కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసినా.. లావాదేవీలకు మాత్రం 12 గంటల వరకే అనుమతించాలని ఎస్‌ఎల్‌బీసీ ఆదేశాలిచ్చింది. కర్ఫ్యూ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్‌ఎల్‌బీసీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. ఆర్‌బీఐ, నాబార్డు ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

కోవిడ్‌–19 కట్టడిలో భాగంగా ఖాతాదారులు సాధ్యమైనంత వరకు బ్యాంకులకు రాకుండా ఇతర ప్రత్యామ్నాయ విధానాలను వినియోగించుకోవాలని ఎస్‌ఎల్‌బీసీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని సూచించింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్, యూపీఐ, బ్యాంక్‌ మిత్ర వంటి సేవలను వినియోగించుకోవడం ద్వారా కరోనా కట్టడికి కృషి చేయాలని కోరింది. బ్యాంకులు కూడా ఈ దిశగా ఖాతాదారులను ప్రోత్సహించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, వ్యాక్సినేషన్‌కు అర్హులైన ఉద్యోగుల జాబితాను పంపించాలని ఎస్‌ఎల్‌బీసీని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ కోరారు.   

>
మరిన్ని వార్తలు