Covid Variant JN.1: కరోనా కొత్త వేరియంట్‌.. 21 కేసులు నమోదు

20 Dec, 2023 17:02 IST|Sakshi

కరోనా వైరస్‌ మరోసారి తన పంజా విసురుతోంది. అంతమైపోయిందనుకున్న కోవిడ్‌ మహమ్మారి కొత్త వేరియంట్‌ రూపంలో ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు భారత్‌లోనూ నమోదవుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు

దేశంలో ఇప్పటి వరకు జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. 

దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్‌పై దృష్టిసారించింది. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
చదవండి: ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్‌ మళ్లీ డుమ్మా?.. కారణమిదే!

కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు . వైరస్‌ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు.. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. 

మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు