కరోనా కేసుల పెరుగుదల: అప్రమత్తంగా ఉందాం.. భయమొద్దు: కేంద్రం

20 Dec, 2023 13:11 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  కరోనా కొత్త వేరియెంట్‌(ఉపరకం) జేఎన్‌.1 (COVID subvariant JN.1) కారణంగా దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.   ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్‌ పరిస్థితులపై సమీక్ష కోసం బుధవారం ఉదయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్‌ మాండవీయ రాష్ట్రాల అధికారుల కీలక సూచనలు చేశారు. 

‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్‌ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’ అని కేంద్రమంత్రి మాండవీయ రాష్ట్రాలకు తెలిపారు.

పండగ సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్‌ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు.

దేశంలో గత కొన్ని రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ జేన్‌.1 వేరియంట్‌పై భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. మరోవైపు.. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాష్ట్రాల్లో కొవిడ్‌ పరీక్షలను పెంచాలని అధికారులను సూచించింది.

>
మరిన్ని వార్తలు