పొదుపు సంఘాల రుణాల వడ్డీ తగ్గింపునకు కెనరా బ్యాంకు ఒకే

31 Aug, 2023 04:42 IST|Sakshi

సీఎం జగన్‌ విజ్ఞప్తితో వడ్డీని తగ్గిస్తున్న బ్యాంకులు

ఇంతకుముందే వడ్డీ తగ్గించిన ఎస్‌బీఐ

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వడ్డీ తగ్గించగా, ఇప్పుడు కెనరా బ్యాంకు కూడా ఆమోదం తెలి­పింది. పొదుపు సంఘాల రుణాలకు వడ్డీ తగ్గింపునకు ఆమోదం తెలిపే ఆదేశాలను కెనరా బ్యాంకు ప్రాంతీయ జనరల్‌ మేనేజర్‌ రవివర్మ బుధవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌కు అందజేశారు.

ఇటీవలే ఎస్‌బీఐ పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీని 12.15 శాతానికి బదులు 9.70 శాతం చేసింది. కెనారా బ్యాంకు కూడా ‘ఎ’ కేటగిరీలో ఉండే పొదుపు సంఘాలకు రూ. 5 లక్షల పైబడి రుణా­లపై 9.70 శాతం వడ్డీనే వసూలు చేస్తామని తెలిపింది. దీంతో పాటు రుణాలపై ఎలాంటి అదనపు, ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్,  యాన్యువల్‌ రివ్యూ లేదా రెన్యువల్‌ చార్జీలను పూర్తిగా మినహాయించింది. బుధవారం సెర్ప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెర్ప్‌ బ్యాంకు లింకేజీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎం.కేశవకుమార్, కెనరా బ్యాంకు డివిజ­నల్‌ మేనేజర్‌ ఐ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు