ముమ్మాటికీ హత్యాయత్నమే  | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ హత్యాయత్నమే 

Published Thu, Aug 31 2023 4:37 AM

The accused attacked with a conspiracy to kill YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగింది ముమ్మాటికీ హత్యాయ­త్నమే. ఆయన్ని హతమార్చాలనే కుట్రతోనే నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్టు ఎన్‌ఐఏ నివేదిక ఇచ్చింది. చార్జిషీట్‌లోనూ ఇదే పేర్కొంది. అంతకు ముందు సిట్‌ కూడా ఇదే చెప్పింది’ అని ఎన్‌ఐఏ కోర్టులో సీఎం జగన్‌ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు.

కానీ, ఓ వర్గం మీడియా క్రియేటివ్‌ సెన్సేషన్‌ కోసమే కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి తెస్తోందని, దర్యాప్తు అధికారుల నివేదికకు విరుద్ధంగా ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంకటేశ్వర్లు బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

నిందితుడే స్వచ్ఛందంగా అంగీకరించాడు
నిందితుడు శ్రీనివాసరావు గతంలో బెయిల్‌పై విడుదలైన తర్వాత తన న్యాయవాదితో (ఇప్పుడున్న న్యాయవాదే) కలిసి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్పప్పుడు ఆయనపై తానే దాడి చేశానని స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఇప్పుడు అదే న్యాయవాది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఆయుధాన్ని సమకూర్చారంటూ కొత్త వాదన తెరపైకి తేవడం సిగ్గుచేటు.

న్యాయ స్థానంలో దాఖలు చేసిన పత్రాల్లోని విషయాన్ని చూడాలి తప్ప, కోర్టులో జరగనివి, జరిగినవి చెప్పడం కచ్చితంగా కోర్టు ధిక్కరణే. దీనికి బాధ్యులు చర్యలు ఎదుర్కోక తప్పదు. సీఎం జగన్‌పై హత్యాయత్నంలో నిందితుడు శ్రీనివాసరావు ఒక ఆయుధం మాత్రమే. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల హస్తం లేకుండా ఈ ఘటన జరగడానికి అవకాశం లేదనడానికి అనేక అనుమానాలు ఉన్నాయి. కేవలం దర్యాప్తును, కోర్టు విచారణను తప్పుదోవ పట్టించడానికి, రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేయడం న్యాయం కాదు. 

మీడియాతో సీఎం జగన్‌ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు

కోడి కత్తి అంటూ కేసు తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా ఓ పత్రిక (ఈనాడు) మొదటి నుంచీ వ్యవహరిస్తోంది. ఘటన జరిగిన వెంటనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడు జె.శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ అభిమాని అని  ప్రకటించారు. సానుభూతి కోసమే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న డీజీపీ ఏకపక్షంగా ప్రకటించారు.

అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఓ వర్గం మీడియా సైతం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన (2018 అక్టోబరు 25) మర్నాటి నుంచే ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కథనాలు ప్రచురించింది. నిందితుడు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడని, అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఏకపక్షంగా రాసేశారు. ఆ దాడిలో వైఎస్‌ జగన్‌కు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ కత్తి మెడలో దిగి ఉంటే ప్రాణాలు పోయేవని వైద్యులు నిర్ధారించారు.

పోలీ­సులు న్యాయస్థానా­నికి సమర్పించిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ, ఓ ప్రతిక (ఈనాడు) మాత్రం వక్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. బాధితుడైన వైఎస్‌ జగన్‌ను అవహేళన చేస్తోంది. బ్లేడ్‌లతోనే ఎన్నో హత్యలు చేస్తున్నారు. కోడి కత్తి చిన్నగా ఉన్నా అత్యంత పదునుగా ఉంటుంది. కానీ కేసు తీవ్రతను తగ్గించి చూపించేందుకు ప్రతిసారీ కోడి కత్తి అంటూ ఓ ఆయుధాన్ని కేసుగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తోంది.


దాడి నాటి దృశ్యం

కేసులున్న వ్యక్తికి ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఎలా?
నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ విమానాశ్రయం రెస్టారెంట్‌ ఫ్యూజన్‌ ఫుడ్స్‌లో ఉద్యోగంలో చేరడంతోనే ఈ కుట్రకు బీజం పడింది. వాస్తవానికి విమానాశ్రయంలో పనిచేసే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేస్తేనే ఉద్యోగంలో చేర్చుకోవాలి. శ్రీనివాసరావుకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఎన్‌వోసీ ఎవరు ఇచ్చారన్నది కీలకంగా మారింది.

శ్రీనివాసరావుపై 2017లో అప్పటి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఓ కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌తో పాటు చార్జిషీట్‌ కూడా దాఖలు చేశారు. అంటే అతనికి నేర చరిత్ర ఉన్నట్టే. పైగా, అతన్ని రెస్టారెంట్‌లో చేర్పించడానికి ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి ఆతృత కనబరచడం గమనార్హం. శ్రీనివాసరావుపై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎలాంటి కేసులు లేవని ఆ పోలీస్‌ స్టేషన్‌ అధికారి ఎన్‌వోసీ ఇచ్చారు.

ఇతర ప్రాంతాల్లో అతనిపై కేసులు ఉన్నాయో లేవో వారికి తెలియదని చెప్పినట్టే. కానీ హర్షవర్ధన్‌ చౌదరి మాత్రం శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి నేర చరిత్ర లేదని తానే సొంతంగా నిర్ధారిస్తూ ఎన్‌వోసీ సమర్పించారు. ఏ ప్రాతిపదికన ఆయన అలా చెప్పారు? అంటే శ్రీనివాసరావు నేర చరిత్రను గోప్యంగా ఉంచుతూ డీజీసీఏను తప్పుదోవ పట్టిస్తూ మరీ ఎన్‌వోసీ ఇచ్చారు. ఇందులో కచ్చితంగా కుట్రకోణం ఉంది.

సాక్ష్యం చెప్పడానికి రానని సీఎం చెప్పలేదు
ఎన్‌ఐఏ దర్యాప్తు అనంతరం తొలి చార్జిషీట్‌ దాఖలు చేసేటప్పుడు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో పెద్ద కుట్రకోణం దాగి ఉందని, తదుపరి దర్యాప్తు చేపడతామని పేర్కొంది. తొలుత 39 మంది సాక్షులను తూతూమంత్రంగానే విచారించి వదిలేసింది. 2019 జనవరి 23న చార్జిషీట్‌ దాఖలు చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సాక్షిని కూడా విచారించలేదు. ఒక్క డాక్యుమెంట్‌ను కూడా సేకరించలేదు. సిట్‌ అధికారులు ఇచ్చిన రికార్డులను మాత్రమే 2019 జూలై 23న కోర్టులో దాఖలు చేశారు. తాజాగా కొత్త అంశాలు వెలుగులోకి రాలేదని మాత్రమే కోర్టులో చెప్పింది. దర్యాప్తు అవసరం లేదని ఎక్కడా రాయలేదు.

కానీ ఎల్లో మీడియా మాత్రం ఇకపై ఎన్‌ఐఏ విచారణ అవసరం లేదని చెప్పినట్టు రాస్తోంది. ఈ కేసులో సీఎం జగన్‌ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రానని ఎక్కడా చెప్పలేదు. తన సాక్ష్యం రికార్డు ప్రక్రియలో ప్రజలకు అసౌకర్యం కులుగుతుందని మాత్రమే చెప్పారు. అడ్వొకేట్‌ కమిషన్‌ ద్వారా సాక్షులను విచారించే అవకాశం ఉందని, దాని ప్రకారం తనను విచారించాలని అనుమతి కోరుతూ ఎన్‌ఐఏ న్యాయ స్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని కూడా వక్రీకరిస్తున్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ కోరిక మేరకే విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారు. దీనిపైనా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాలు విశాఖ ఎన్‌ఐఏ న్యాయస్థానానికి, మిగిలిన జిల్లాల్లోని కేసుల విచారణ పరిధి విజయవాడ న్యాయస్థానానికి ఉంటుంది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సైతం జీవో ఇచ్చింది.  

కుట్రకోణం ఉంది.. అనుమానాలివే 
తనపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందని ఈ కేసులో బాధితుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు బలాన్ని చేకూ­రుస్తూ స్పష్టమైన అంశాలను ప్రస్తావించారు. నేర చరిత్ర ఉన్న నిందితుడు శ్రీనివాసరావును విమానాశ్రయంలోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో ఉద్యోగంలో చేర్పించడం, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోకి నిందితుడు ఆయుధాన్ని అక్రమంగా తీసుకురావడం, ఆ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌ చౌదరి టీడీపీ నేత కావడం మొదలైన అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

కుట్ర కోణాన్ని, సూత్రధారులపై సమగ్ర దర్యాప్తు చేయాలి
హత్యాయత్నం వెనుక కుట్రను ఛేదించాలని, దాని వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరపున ఎన్‌ఐఏను, న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాం. ఎన్‌ఐఏ సమగ్రంగా దర్యాప్తు చేయాలనేదే మా వాదన. అందులో మేం చెప్పిన అంశాలివీ..
విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌ చౌదరికి, నిందితునికి ఉన్న సంబంధం ఏమిటి?
 నిందితుడు శ్రీనివాసరావుపై గతంలో కేసులు ఉన్నప్పటికీ, విమానాశ్రయంలోని రెస్టారెంట్‌లో ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో చెప్పిన విషయం వాస్తవమే కదా!
    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో ఉన్నప్పుడు కాఫీ ఇచ్చేందుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావునే ఎందుకు పంపించారు? 
    హర్షవర్థన్‌ చౌదరికి విశాఖపట్నం విమానా­శ్రయంలో రెస్టారెంట్‌ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? 
 హర్షవర్థన్‌ చౌదరి, నారా లోకేశ్‌ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? 
   ఎన్‌ఐఏకి రికార్డు ఇవ్వొద్దని సిట్‌ దర్యాప్తు అధికారి శ్రీనివాసరావును అప్పటి డీజీపీ ఎందుకు ఆదేశించారు?  కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు?
    స్థానిక పోలీసులు బయోమెట్రిక్‌ హాజరు మిషన్‌ను సీజ్‌ చేసి వివరాలు సేకరించగా అందులో నిందితుడు శ్రీనివాసరావు పేరు నమోదు కాలేదు. హర్షవర్ధన్‌ కూడా పేరు ఎంట్రీ చేయలేదని చెప్పారు. కానీ, ఎన్‌ఐఏ దగ్గరికి వచ్చేసరికి బయోమెట్రిక్‌ హాజరులో నిందితుడు అక్కడే పని చేస్తున్నట్టు, దాడి జరిగిన రోజు కూడా అక్కడే ఉన్నట్టు చెప్పారు. ఇవి పరస్పర విరుద్ధ అంశాలు.
 అదే రోజు విమానాశ్రయం లాంజ్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదు? 

Advertisement
Advertisement