వైద్యులు పరిశోధనలపై దృష్టి సారించాలి

28 Feb, 2022 04:15 IST|Sakshi
వర్చువల్‌ విధానంలో మాట్లాడుతున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

‘న్యూరో సైన్సెస్‌’పై అంతర్జాతీయ సదస్సులో గవర్నర్‌ విశ్వభూషణ్‌ 

తిరుపతి తుడా: అంతర్జాతీయ సదస్సులో జరిగే చర్చలు సమాజానికి మేలుకలిగేలా ఉండాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాల ఆవరణలోని ప్రేమసాగర్‌రెడ్డి భవనంలో ఎస్వీ మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఐ.ఎం.ఎ. సహకారంతో ‘న్యూరో సైన్సెస్‌’పై నిర్వహించిన 15వ అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఆయన వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, పరిశోధకులు, ప్రాక్టీస్‌ చేసే న్యూరాలజిస్టులు, వర్థమాన విద్యార్థులు తమ పరిశోధన ఫలితాలను ప్రపంచ నిపుణులతో పంచుకోవాలని సూచించారు.

కాన్ఫరెన్స్‌లకు అంతర్జాతీయ వేదికను ఎంచుకోవడం వల్ల వారిలో కొత్త ఆలోచనలను ప్రేరేపించవచ్చని చెప్పారు. న్యూరాలజీ స్పెక్ట్రమ్‌ అంతటా న్యూరోలాజికల్‌ సమస్యలతో జీవిస్తున్న వారి జీవితాలను మెరుగుపరచడం, మానసిక ఆరోగ్య శాస్త్రవేత్తలు, అభ్యాసకుల వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు పరస్పరం  ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రపంచ ఆరోగ్యానికి కొత్త సాంకేతికత అప్లికేషన్లు, డయాగ్నస్టిక్‌ టెక్నిక్‌ల అభివృద్ధికి కొత్త శాస్త్రీయ విధానాలు ఎంతైనా అవసరమని చెప్పారు.

వైద్యులు పరిశోధనలపై దృష్టిసారించాలని కోరారు. సుమారు 1,500 మంది వైద్యులు పాల్గొంటున్న ఈ సదస్సులో మనదేశం నుంచి 12 మంది వక్తలు, విదేశాల నుంచి ఏడుగురు అంతర్జాతీయ ప్రసిద్ధ వక్తలు తమ వైద్య వృత్తిలోని జ్ఞానాన్ని అందించడం సంతోషించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. తిరుపతి నుంచి నిర్వాహక కమిటీ చైర్మన్, ఐఎంఏ ఎస్వీఎంసీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రాయపు రమేష్, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ సతీష్‌ పాల్గొన్నారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ సహజానంద్‌ ప్రసాద్‌సింగ్, ఏపీడీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు, స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.వెంగమ్మ, డాక్టర్‌ థామస్‌ మాథ్యూ, డాక్టర్‌ అతుల్‌ గోఝల్, తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు