కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు

19 May, 2022 04:31 IST|Sakshi

ఇక.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం

కొత్తగా రేపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు

సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్‌/రాజమహేంద్రవరం సిటీ: కోనసీమ జిల్లా పేరును రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చింది. ఇటీవల జిల్లాల పునర్‌వ్యస్థీకరణలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం కోనసీమ జిల్లాగా ఏర్పాటైంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి అమలాపురం ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేసి దానికి కోనసీమ పేరు పెట్టారు.

ఈ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని ప్రభుత్వానికి పెద్దఎత్తున వినతులు వచ్చాయి. రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్‌ను గౌరవించేలా ఆయన పేరును కోనసీమ జిల్లాకు పెట్టాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు బుధవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేశారు. దీనిపై కోనసీమ జిల్లా పరిధిలో నివసించేవారు 30 రోజుల్లోపు సూచనలు, అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొన్నారు. 

9 మండలాలతో రేపల్లె రెవెన్యూ డివిజన్‌ 
రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌ ఇచ్చింది. బాపట్ల జిల్లాలో ఇప్పటికే బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచేయగా తాజాగా తొమ్మిది మండలాలతో రేపల్లె డివిజన్‌ను ఏర్పాటు చేసింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు, నగరం మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు.

ఈ మండలాలన్నీ ప్రస్తుతం బాపట్ల రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. వాటిని రేపల్లె డివిజన్‌లోకి మార్చారు. ప్రస్తుతం చీరాల డివిజన్‌లో ఉన్న పర్చూరు, మార్టూరు, యద్ధనపూడి మండలాలను బాపట్ల డివిజన్‌లో చేర్చారు. వీటిపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లో బాపట్ల జిల్లా కలెక్టర్‌కు తెలపాలని నోటిఫికేషన్‌లో సూచించారు.

మంత్రుల హర్షం
కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చడంపై రాష్ట్ర మంత్రులు విశ్వరూప్, వేణు హర్షం వ్యక్తం చేశారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితుల మనోభావాలను గుర్తించి ముఖ్యమంత్రి జగన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. మంత్రి వేణు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ సీఎం కోనసీమ జిల్లా ప్రజల మనోభావాలు గుర్తించి జిల్లా పేరు మార్చటం సంతోషకరమన్నారు. 

మరిన్ని వార్తలు