శాశ్వత తాగునీటి పథకానికి సహకరించండి

22 Oct, 2020 04:20 IST|Sakshi
అమితాబ్‌కాంత్‌కు వినతి పత్రం ఇస్తున్న మంత్రి బుగ్గన

నీతిఆయోగ్‌కు ఏపీ మంత్రి బుగ్గన విజ్ఞప్తి 

డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డితోనూ భేటీ 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శాశ్వత తాగునీటి పథకానికి సహకరించాలని నీతిఆయోగ్‌కు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విజ్ఞప్తిచేశారు. సాగు, తాగునీటి పథకాలపై నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌కు వివరించి నిధుల కేటాయింపునకు కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. ఆయన బుధవారం న్యూఢిల్లీలో నీతిఆయోగ్‌ సీఈవోతోను, డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డితోను, జాతీయ రహదారులు, రహదారి రవాణాశాఖ అధికారులతోను సమావేశమయ్యారు. అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయాలు, సాగు, తాగునీటి పథకాలపై అమితాబ్‌కాంత్‌తో చర్చించానన్నారు.

విభజన తర్వాత వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి యువ సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో కృషిచేస్తున్నారని నీతిఆయోగ్‌ సీఈవో ప్రశంసించారని చెప్పారు. రక్షణ రంగానికి సంబంధించి ఏపీలో పెండింగ్‌ ప్రాజెక్టులపై డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డితో సమావేశమైనట్లు తెలిపారు. విశాఖపట్నం, దొనకొండ, నెల్లూరు, అనంతపురం, ఓర్వకల్లు ప్రాంతాల్లో రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుపై చర్చించినట్లు చెప్పారు. ఇటీవల విజయవాడ కనకదుర్గ పైవంతెన ప్రారంభసమయంలో కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా మంత్రి గడ్కరీతో సీఎం జగన్‌ మాట్లాడిన ప్రాజెక్టులకు సంబంధించి ఆ శాఖ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. పోలవరం నిధుల విడుదల ప్రక్రియ సాగుతోందని చెప్పారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు