కాల్‌మనీ ఊబిలో 450 మంది చిరు ఉద్యోగులు!

30 Dec, 2020 10:19 IST|Sakshi
విజయవాడలో వేధింపులకు గురైన బండి నూకమ్మ

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు, పింఛన్లను వదలని కాల్‌నాగులు  

కోర్టుల్లో దావాలు వేసి మరీ వేధింపులు

 సాక్షి, అమరావతిబ్యూరో/పటమట: విజయవాడ కొత్తపేట జోడు బొమ్మల సెంటర్‌కు చెందిన బవిడిశెట్టి రాము వీఎంసీలో ఓ చిరు ఉద్యోగి. పెదబాబు అనే వడ్డీ వ్యాపారి దగ్గర రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకపోవడంతో పెదబాబు కోర్టు ద్వారా అతని పింఛన్‌ నుంచి నెలనెలా కొంత సొమ్ము జమ చేసుకుంటున్నాడు. అదే సమయంలో రాము వన్‌టౌన్‌కు చెందిన రాంప్లి పాపారావు వద్ద కూడా రూ.2 లక్షలు అప్పు తీసుకుని చెల్లించేశాడు. అయితే అతను పాపారావుకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు వెనక్కు తీసుకోలేదు. ఇప్పుడా ప్రామిసరీ నోట్ల ఆధారంగా పాపారావు కోర్టుకు వెళ్లి రూ.7 లక్షలకు దావా వేశాడు. పాపారావు వేధింపులు భరించలేక బవిడిశెట్టి రాము ఇటీవల మృతి చెందాడు. అయినా అప్పు చెల్లించాలంటూ అతని కుటుంబ సభ్యులను కాల్‌మనీ గ్యాంగ్‌ వేధిస్తోంది.

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ)లో శానిటరీ విభాగంలో పనిచేస్తున్న సుమారు 450 మంది చిరు ఉద్యోగులు అప్పుల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కాల్‌మనీ వ్యాపారులు రాబందుల్లా మారి ఉద్యోగులను పీక్కుతింటున్నారు. అవసరాల నిమిత్తం కాల్‌మనీ వ్యాపారుల వద్ద రూ.వేలల్లో అప్పు తీసుకున్న పాపానికి రూ.లక్షల్లో డబ్బులు చెల్లించినప్పటికీ వారి అప్పు తీరడం లేదు. పైగా రూ.లక్షల్లో అప్పు ఉన్నాడంటూ లీగల్‌ నోటీసులు రావడం.. పింఛన్లు, రిటైర్‌ బెనిఫిట్లు అటాచ్‌మెంట్‌కు గురవతుండటంతో వీఎంసీ ఉద్యోగుల్లో దిక్కుతోచని స్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగులకైతే ముక్కు మొహం తెలియని వారి నుంచి లీగల్‌ నోటీసులు రావడం గమనార్హం.

కాల్‌మనీ వ్యాపారులు తెరవెనుక ఉండి ఇతరుల పేరిట లీగల్‌ నోటీసులు పంపుతూ వసూళ్లకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా వీఎంసీ అడ్డాగా జరుగుతోన్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇటీవల మరణించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ముక్కంటి కూడా కాల్‌మనీ వ్యాపారుల వేధింపులకు గురైనట్లు సమాచారం. వీఎంసీలో కీలక స్థానంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఓ ఉద్యోగి కాల్‌మనీ వ్యాపారులు కలిసి ఈ దందాను కొనేళ్లుగా సాగిస్తున్నట్లు సమాచారం. అతనికి చెందిన రూ.20 లక్షలకు పైగా డబ్బును కాల్‌మనీ వ్యాపారులు వడ్డీకి తిప్పుతున్నట్లు వీఎంసీ ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులెవరైనా తీసుకున్న అప్పు చెల్లించకపోతే వారికి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే పనిని సైతం అప్పట్లో ఆ ఉద్యోగి చేసేవాడని.. ఇందుకు అకౌంట్స్‌ విభాగంలోని కొందరు సహకారం ఉన్నట్లు తెలుస్తోంది.  

భర్త అప్పును భార్య చెల్లించినా..  
బండి చిన్న నూకమ్మ వీఎంసీలో శానిటరీ విభాగంలో పనిచేస్తూ ఈ ఏడాది జూన్‌లో రిటైరైంది. ఈమె భర్త వడ్డాది నాగరాజు ఆర్టీసీలో పనిచేస్తూ 2017లో చనిపోయాడు. ఇతను రాంపల్లి పాపారావు వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. భర్త చెల్లించాల్సిన అప్పునకు గానూ పాపారావుకు నూకమ్మ ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. ఆ తర్వాత వడ్డీతో సహా అప్పు చెల్లించేసింది. ఆ సమయంలో పాపారావు నుంచి తాను రాసిచ్చిన ప్రామిసరీ నోటు తీసుకోవడం మరిచింది. ఇప్పుడదే ఆమెకు శాపంగా మారింది. ఇటీవల ఆమెకు కోర్టు నుంచి రెండు లీగల్‌ నోటీసులు వచ్చాయి. అందులో ఒకటి రూ.7 లక్షలు చెల్లించాలంటూ మంగళగిరికి చెందిన పలతోటి మరియరాజు నుంచి కాగా.. మరొకటి గుణదలకు చెందిన జాదు రాజేశ్వరి అనే మహిళ నుంచి రూ.లక్షలు అప్పు చెల్లించాలని ఉంది. దీంతో ఆమెకు రావాల్సిన రిటైర్మెంట్‌  బెనిఫిట్స్, పింఛను నిలిచిపోయింది. కాల్‌మనీ వ్యాపారుల వేధింపుల కారణంగా ఆమె అనారోగ్యంతో మంచం పట్టింది. మందులకు కూడా బ్యాంకు నుంచి డబ్బు తీసుకోలేని దుస్థితిలో ఉంది. 

మరిన్ని వార్తలు