అనుభవం లేదు.. సమర్థతా లేదు 

11 Aug, 2021 02:42 IST|Sakshi

దేవినేని ఉమ అండతో విజయ డెయిరీ చైర్మన్‌ పోస్టులో తిష్ట 

అప్పటికప్పుడు పాల సొసైటీ చైర్మన్, వెంటనే డైరెక్టర్‌ కిరీటం 

‘సాక్షి’ కథనంతో ఉలికిపాటు 

భూముల కొనుగోళ్లలో డొంకతిరుగుడు సమాధానం చెప్పించిన చైర్మన్‌  

సాక్షి, అమరావతి: ఏ రంగంలో అయినా, ఏ సంస్థలో అయినా ఉన్నత స్థానానికి వెళ్లాలంటే దానికి సంబంధించి ఎంతోకొంత అనుభవం ఉండాలి. దాన్ని నిర్వహించే సమర్థత ఉండాలి. అలాంటివేమీ లేకుండా.. అప్పటివరకు దాంతో సంబంధంలేని చలసాని ఆంజనేయులు ఒక్కసారిగా విజయ డెయిరీ చైర్మన్‌గా అందలం ఎక్కేశారు. దీనికి టీడీపీకి చెందిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ వ్యూహమే కారణమని చెబుతున్నారు. దాసరి బాలవర్థనరావు చైర్మన్‌ కాకుండా అడ్డుకునేందుకు ఆంజనేయుల్ని రంగంలోకి దించారు. అప్పటివరకు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలతో ఎలాంటి సంబంధంలేని ఆయన్ని 2017లో ఆయన సొంత గ్రామం బాపులపాడు మండలం కాకులపాడు పాల సొసైటీకి చైర్మన్‌గా చేశారు. వెంటనే విజయ డెయిరీ డైరెక్టర్‌గా రంగంలోకి దింపి పాలకవర్గంలోకి వెళ్లేలా చేశారు.

ఆ తర్వాత కొద్దిరోజులకు బాలవర్థనరావును పక్కకునెట్టి మండవ జానకిరామయ్య స్థానంలో ఆంజనేయుల్ని చైర్మన్‌గా ఎన్నుకునేలా చేశారు. దీంతో వేలాది మంది పాడి రైతుల భవితవ్యంపై ఏమాత్రం అవగాహనలేని వ్యక్తికి పగ్గాలిచ్చారు. ఇప్పుడు ఆయన తప్పుడు నిర్ణయాలు సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేశాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తనకు రాజకీయంగా లబ్ధి కలుగుతుందనే కారణంతో దేవినేని ఉమా ప్రతిష్టాత్మకమైన సంస్థకి చలసాని ఆంజనేయుల్ని చైర్మన్‌గా చేసేలా చక్రం తిప్పి రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారని పలు సొసైటీల చైర్మన్లు ఆరోపిస్తున్నారు.

ఎన్నో అవకతవకలు..
ఏ సంస్థలో అయినా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లకు ఒక విధానం ఉంటుంది. కానీ, విజయ డెయిరీలో మాత్రం చైర్మన్‌ తనకు కావాల్సిన వాళ్లకి ఒకలా, మిగిలిన ఉద్యోగులకు మరోలా ఇవ్వడంపై సంస్థలో దుమారం రేగుతోంది. తాను చెప్పినట్లు నడుచుకునే వారికి 15–20 శాతం ఇంక్రిమెంట్‌ ఇస్తూ మిగిలిన వారికి తూతూమంత్రంగా ఇస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. అంతేకాక..
► 25 ఏళ్లుగా డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తికి సంస్థలో జరిగే వివిధ పనుల కాంట్రాక్టుల్ని ఎలాంటి టెండర్లు లేకుండా చైర్మన్‌ కట్టబెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. 
► ఇలాగే, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు చిల్లింగ్‌ సెంటర్, కళ్యాణ మండపం మరమ్మతుల పనుల్ని అతనికి అప్పగించారు. 
► తాను చైర్మన్‌ అయ్యాక తనకు అనుకూలమైన అధికారుల్ని నియమించుకునే విషయంలో నిబంధనలకు పాతరేశారు. 
► ఉదా.. హెరిటేజ్‌ సంస్థ తొలగించిన ఇద్దరిని డీజీఎం స్థాయిలో లక్షల జీతాలకు నియమించడంపై పలు సొసైటీల చైర్మన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 
► ఇలా స్వలాభం కోసం నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను భ్రష్టుపట్టిస్తున్నారని అన్ని వైపుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చైర్మన్‌ మాత్రం తాను డెయిరీని అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై పూర్తిస్థాయి విచారణ జరిగితే అక్రమాలు బట్టబయలవుతాయని పాడి రైతులు చెబుతున్నారు. 

‘సాక్షి’ కథనంతో ఉలికిపాటు.. 
సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై ‘సాక్షి’ మంగళవారం సంచికలో ప్రచురితమైన ‘‘పా‘పాల’ పుట్ట’’ కథనంతో చైర్మన్‌.. ఆయనకు మద్దతుదారులు ఉలిక్కిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని చైర్మన్‌ ఒక పత్రికా ప్రకటన తయారుచేసి జిల్లాలోని వివిధ పాల సొసైటీలకు పంపి మీడియా సమావేశాలు పెట్టించారు. ఇవేమీ తమకు తెలీదని కొందరు తప్పించుకున్నారు. సంస్థలోని పలువురు డైరెక్టర్లతో విజయవాడలో మీడియా సమావేశం పెట్టి తనకు అనుకూలంగా మాట్లాడించారు. ‘సాక్షి’ కథనంలో పేర్కొన్న అంశాలకు వారు  సమాధానం చెప్పకుండా చైర్మన్‌ను పొగడడానికి తాపత్రయపడ్డారు. భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వివరణ ఇవ్వకుండా గత పాలకవర్గం నుంచి భూములు కొంటున్నారంటూ కొత్త వాదన లేవనెత్తారు. అలాగే, విజయ పార్లర్లలో బయట ఉత్పత్తుల అమ్మకాలు సంస్థ వ్యాపార సూత్రమని సమర్ధించుకున్నారు. రైతులకివ్వాల్సిన బోనస్‌ చెల్లించకపోవడం, కమీషన్ల కోసం జరిపిన కొనుగోళ్లు వంటి అంశాలపై డొంకతిరుగుడు వివరణలు ఇచ్చారు. మొత్తం మీద అవాస్తవాలు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు