నిష్క్రమించిన ఈశాన్య రుతుపవనాలు

15 Dec, 2021 03:47 IST|Sakshi

నేటినుంచి చలి తీవ్రత పెరిగే అవకాశం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించాయి. దీనికి తోడు మధ్య భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టనున్నాయి. బుధవారం నుంచి చలి గాలుల తీవ్రత పెరుగుతుందని, మొత్తంగా శీతాకాలం పూర్తిగా ప్రవేశించినట్లేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ శీతాకాలంలో రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు, హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా సాధారణ పరిస్థితులే కనిపిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం మామూలుగా ఉన్నట్లు కనిపించినా.. ఈశాన్య గాలులు వీస్తుండటం, మంచు ప్రభావంతో చలి వణికించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది.  

మరిన్ని వార్తలు