చినుకు చుక్క రాలలేదు!

2 Nov, 2023 03:30 IST|Sakshi

అక్టోబర్‌లో తీవ్ర వర్షాభావం 

నైరుతి నిష్క్రమణసమయంలో పడని వర్షాలు 

హైదరాబాద్‌లో సున్నా వర్షపాతం 

రాష్ట్రంలో 8.8 సెం.మీ.లకు పడింది 0.53 సెం.మీ. వర్షమే 

నవంబర్‌లోనూ అవే పరిస్థితులు: ఐఎండీ 

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల సీజన్‌ సెపె్టంబర్‌తో ముగిసినప్పటికీ.. రుతుపవనాల నిష్క్రమణ సమయమైన అక్టోబర్‌లో వర్షాల నమోదుకు బాగానే అవకాశాలుంటాయి. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే అక్టోబర్‌లో సాధారణం నుంచి రెట్టింపు స్థాయిలో వర్షాలు కురవగా.. ప్రస్తుత అక్టోబర్‌లో మాత్రం తీవ్ర వర్షాభావం నెలకొంది. 8.8 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను, నెల పూర్తయ్యే నాటికి కేవలం 0.53 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. హైదరాబాద్‌లో అయితే.. వర్షం పడనేలేదు.

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు నమోదవుతాయని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించగా, సాధారణానికి కాస్త ఎక్కువగానే సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్‌లో రాష్ట్ర సగటు 73.8 సెంటీమీటర్లు ఉండగా ఈసారి 86.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

కానీ మండలాలను యూనిట్‌గా తీసుకుంటే మాత్రం చాలాచోట్ల లోటు వర్షపాతమే నమోదైంది. అక్టోబర్‌లో నైరుతి నిష్క్రమణతో పాటు ఈశాన్య రుతుపవనాల ప్రవేశం ఉంటుంది. ఈ సమయంలో నెలకొనే వాతావరణ పరిస్థితులతో సాధారణంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా తీవ్ర వర్షాభావమే నమోదయ్యింది. 

‘ఈశాన్య’సీజన్‌ మొదలైనా.. 
ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల సీజన్‌ కొనసాగు తోంది. రాష్ట్రంలో నైరుతి, ఈశాన్య సీజన్‌లో జూన్‌ నెల నుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకు 82.92 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 86.76 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపా తం నమోదైనప్పటికీ పలు జిల్లాల్లో లోటు వర్షపా తం ఉంది. జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా..మరో 21 జిల్లాల్లో సాధారణం, 7 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇక నవంబర్‌ నెలలోనూ అక్టోబర్‌ మాదిరి వర్షాభావ పరిస్థితులే ఉంటాయని ఐంఎండీ తాజాగా వెల్లడించింది.

ఈ నెలలో కేవలం ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణాదిన కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నవంబర్‌లో రాష్ట్రంలో 2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పతనమై చలి తీవ్రత పెరగాల్సి ఉండగా.. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు