‘స్కిల్‌’ కాదు డొల్లే

14 Sep, 2023 04:07 IST|Sakshi

విహార యాత్రంటూ బీసీ వెల్ఫేర్‌ స్కూళ్ల విద్యార్థుల తరలింపు 

1.21 లక్షల మంది ‘స్కిల్‌’ నిపుణుల్లో 70,000 మంది స్కూల్‌ పిల్లలే 

వారికి శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు తయారు చేసి నిధులు స్వాహా 

ఆ విద్యార్థులకు అధిక జీతాలతో ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలు ఎక్కడ? 

ఆరు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో సగానికిపైగా ల్యాబ్‌లే ఏర్పాటు కాలేదు 

నాడు లక్షలాది మందికి ఉపాధి కల్పించారంటూ ఎల్లో మీడియా బాకా  

సాక్షి, అమరావతి:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ముసుగులో మాజీ సీఎం చంద్రబాబు చేసిన మోసాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2.50 లక్షల మందికి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో డొల్లతనం బయటపడింది. ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు సైతం నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చినట్లు కాగితాలపై చూపారు. పాఠశాల విద్యార్థులను విజ్ఞాన యాత్రల పేరిట సీమెన్స్‌కు తెలియకుండా ఆ కంపెనీ పేరిట ఏర్పాటు చేసిన సెంటర్లకు తరలించారు.

బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలకు చెందిన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కంప్యూటర్‌–ఐటీ ఫండమెంటల్స్, ఎల్రక్టానిక్స్‌ ఆఫీస్, ఎలక్ట్రికల్‌ హోమ్‌ లాంటి కోర్సుల్లో వొకేషనల్‌ ట్రైనింగ్‌ ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించారు. చంద్రబాబు ప్రభుత్వం వైదొలగేలోపు మొత్తం 1,21,654 మంది నైపుణ్య శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 70,000 మంది బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం.

విహారయాత్రకు వచ్చిన ఒక్కో విద్యార్థికి రూ.200 ఇచ్చినట్లు సంతకాలు పెట్టించారు. వాటిని చూపిస్తూ వారందరికి అత్యున్నత నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు తయారు చేశారు. ఇలా శిక్షణ పొందిన విద్యార్థులకు అధిక జీతాలు చెల్లించి తీసుకున్న కంపెనీలు ఏమిటో చంద్రబాబుకు బాకా ఊదుతున్న ఎల్లో మీడియానే చెప్పాలి!!  

ల్యాబ్‌లూ లేవు.. 
సీమెన్స్‌ పేరును తెరపైకి తీసుకొచ్చి రూ.3,300 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఘనంగా చెప్పుకున్నా వాస్తవంగా రూ.70 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్న విషయం ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో బహిర్గతమయ్యింది. ఆరు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలు, వాటికి అనుబంధంగా 34 టీఎస్‌డీఐలు (టెక్నికల్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్స్‌) ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు కాగితాల్లో చూపించారు. పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు చూపించే ఫోటోలన్నీ ఉత్తిత్తి ల్యాబుల్లో తీసినవే.

సీఎన్‌సీ మెకానిక్, టూ వీలర్, ఫోర్‌ వీలర్‌ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ సర్వీస్‌ సెక్టార్, క్యాడ్‌ రామ్, ఐసీటీ, అగ్రి ఫార్మ్‌ మెకనైజేషన్‌ లాంటి కోర్సుల గురించి విద్యార్థులకు కంప్యూటర్‌ స్క్రీన్‌పై చూపించి శిక్షణ ముగించారు. ఒక్కో సీవోఈలో 15 ల్యాబ్‌లు, టీఎస్‌డీఐలో 10 ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు రికార్డులో చూపించారు.

రాష్ట్రం వాటాగా తరలించిన రూ.371 కోట్లను కాజేసిన కేటుగాళ్లు ఒప్పందం ప్రకారం ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. ఈ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌కు ఆదేశించిన వెంటనే ఆగమేఘాలపై కొన్ని ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం గమనార్హం.  

మరిన్ని వార్తలు