వాడీ వేడీ లేని బాబు ప్రసంగాలు.. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటూ..

20 Aug, 2023 12:52 IST|Sakshi
పరారే పరారే..: రావులపాలెం సభలో చంద్రబాబు ప్రసంగిస్తూండగానే వెళ్లిపోతున్న ప్రజలు

సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్‌ మొదలయ్యింది. ప్రతిపక్ష టీడీపీకి ఈ ఎన్నికలు చావోరేవో అనే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్నా అది ఏమాత్రం కనిపించడం లేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి సానుకూల ఓటు కనిపించడం టీడీపీకి కొరుకుడు పడటం లేదు. గెలుస్తామన్న ధైర్యం పార్టీ క్యాడర్‌లో నానాటికీ దిగజారిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక మాయ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ యాత్రకు ప్రజల మద్దతు కొరవడింది.

ఈ యాత్ర ద్వారా పారీ్టకి ‘భవిష్యత్తు’ ఉంటుందనే భరోసాను కానీ, గెలుస్తామనే ‘గ్యారెంటీ’ని కానీ పార్టీ క్యాడర్‌కు ఆయన కల్పించలేకపోయారు. జిల్లాలోని మండపేట, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు మూడు రోజులు పర్యటించారు. ఎన్నికల ముందు చేపట్టిన ఈ యాత్రతో పారీ్టలో కొత్త జోష్‌ వస్తుందని, దిశానిర్దేశం చేస్తారని, నియోజకవర్గ ఇన్‌చార్జిల నియామకం, నాయకుల మధ్య విభేదాల పరిష్కారానికి మార్గం చూపుతారని క్యాడర్‌ ఆశించింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ చంద్రబాబు పర్యటనలో నెరవేరలేదు.

జనం లేక వెలవెల 
మూడు నియోజకవర్గాల్లోనూ చంద్రబాబుకు పెద్దగా ఆదరణ లభించలేదు. వరుసగా మూడుసార్లు గెలిచిన మండపేట సభకు అంచనా వేసుకున్న జనంలో సగం మంది కూడా రాలేదు. సభను మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఇరుకు సందులో ఏర్పాటు చేసినా నిండలేదు. రావులపాలెంలో అయితే బాబు ప్రసంగం ఆరంభం కాగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘పరారే పరారే’ అంటూ తిరుగుముఖం పట్టారు. జిల్లా కేంద్రం అమలాపురం సభ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. రోడ్డు షో చేస్తున్నా ఎక్కడా పట్టుమని పది మంది కూడా ఎదురేగి స్వాగతం పలకలేదు. రోడ్‌ షోలో జనం లేని విజువల్స్‌ సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరువు తీసింది. జనం కోసం సభలను ఆలస్యంగా ప్రారంభించాల్సి రావడం, జనాన్ని తీసుకురావాలంటూ అమలాపురంలో పార్టీ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు చివరి నిమిషం వరకూ క్యాడర్‌ను బతిమలాడుకోవడం కనిపించింది. 

అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటూ..
చంద్రబాబు ప్రసంగాల్లో వాడీవేడి లేదు. సర్వం గందరగోళం. రైతుల గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పారు. ఆ వెంటనే పోలవరం 75 శాతం తానే పూర్తి చేశానని, బాలయోగి హయాంలో కొబ్బరి కొనుగోలు చేశారని.. ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా ఇష్టానుసారం మాట్లాడారు. తన కొత్త విజన్‌–2047 గురించి బాబు చెప్పిన మాటలు ప్రజలకు అర్థం కాలేదు. అధికారంలోకి వస్తే చేస్తానన్న సూపర్‌ సిక్స్‌ హామీల వల్ల కలిగే లబ్ధిని వివరించినప్పుడు జనం నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో గత్యంతరం లేక అడిగి మరీ ప్రజలతో చప్పట్లు కొట్టించుకున్నారు. 

వ్యక్తిగత దూషణలు
తాను అధికారంలోకి వస్తే ఎన్నో చేస్తానని చెబుతున్నా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో సహనం కోల్పోయిన చంద్రబాబు.. చివరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. పలు సందర్భాల్లో సైకో, సైకో బ్యాచ్, మూర్ఖుడు.. ఇలా రకరకాలుగా దూషించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సైతం చిల్లర మనుషులంటూ విమర్శించి.. తన చిల్లర స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.

విన్నది తక్కువ.. చెప్పింది ఎక్కువ
‘ఆయన రేడియో లాంటి వారు.. మనం చెప్పింది వినరు. ఆయన చెప్పాలనుకున్నదే చెప్పుకుంటూ పోతారు’ అంటూ పాపులర్‌ అయిన ఓ సినిమా డైలాగ్‌... చంద్రబాబు విషయంలో అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఆయా నియోజకవర్గాల్లో మేధావులు, మహిళలు, రైతులు, పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో ఎదుటి వారు చెప్పింది తక్కువే అయినా.. బాబు మాత్రం గంటల తరబడి ప్రసంగాలు దంచికొట్టారు. మండపేట నియోజకవర్గం ఏడిదలో రైతులతో ఏర్పాటు చేసిన రచ్చబండలో ఏకంగా 45 నిమిషాలు మాట్లాడేశారు. చివరకు ఆలమూరులో ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు సైతం ప్రయాణికులు చెప్పింది వినకుండా.. మైకు తీసుకుని అక్కడ కూడా ప్రసంగించేయడం విశేషం.

దిశానిర్దేశం చేయకుండానే...
ఇంత హడావుడీ చేసిన చంద్రబాబు.. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో పార్టీ క్యాడర్‌కు ఎటువంటి దిశా నిర్దేశం చేయలేదు. జిల్లాలో మూడు రోజులున్నా పి.గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గాలకు పూర్తి స్థాయి పార్టీ ఇన్‌చార్జిలను నియమించే విషయం తేల్చలేదు. అమలాపురం, కొత్తపేట, రాజోలు నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తులను చల్లార్చలేదు.కొసమెరుపు ఏమిటంటే.. అధినేత పర్యటన టీడీపీ క్యాడర్‌లో జోష్‌ నింపలేదు. కానీ, అమలాపురం సభ అట్టర్‌ఫ్లాప్‌ అవ్వడం మాత్రం ఇక్కడి ఇన్‌చార్జి ఆనందరావు వ్యతిరేకులను ఖుషీ చేసింది. 

చంద్ర ‘బాబా’..
రావులపాలెం సభలో చంద్రబాబు చేసిన విచిత్ర ప్రసంగానికి అందరూ అవాక్కయ్యారు. తాను పంపే రాఖీలను దేవుని వద్ద 45 రోజులు ఉంచాలని, అవి చేతికి కట్టుకుని.. సమస్య వచ్చినప్పుడు తనను తలచుకుంటే పరిష్కారమవుతుందని చెప్పారు. ఏవో అతీంద్రియ మహిమలున్న ఓ బాబా మాదిరిగా చంద్రబాబు చెప్పిన ఆ మాటలు విని.. నివ్వెరపోవడం సభకు వచ్చిన మహిళల వంతయ్యింది. 

మరిన్ని వార్తలు