అసెంబ్లీలో చంద్రబాబు డ్రామా.. సస్పెన్షన్

30 Nov, 2020 14:25 IST|Sakshi

అసెంబ్లీలో చంద్రబాబు వింత ప్రవర్తన

సాక్షి, అమరావతి : అసెంబ్లీ వేదికగా టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు డ్రామాకు తెరలేపారు. తుపాను నష్టంపై వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ.. టీడీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. సభలో చర్చ జరగకుండా గందరగోళం సృష్టించారు. వ్యవసాయం, వరదలపై మంత్రి సమాధానం చెప్పకుండా అడ్డుతగిలారు. ముఖ్యంగా సభలో చంద్రబాబు ప్రవర్తించిన తీరుపై అధికారపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి.

సొంత పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతుండగా తనకి మైక్ కావాలంటూ చంద్రబాబు వింతగా ప్రవర్తించడం సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీడీపీ సభ్యుడు మాట్లాడుంటే తనకే మైక్ ఇవ్వాలంటూ పోడియం ముందు బైఠాయించారు. సభలో చర్చ సాగకుండా అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులపై స్పీకర్ చర్యలకు ఉపక్రమించారు. శాసనసభ నుంచి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలను నేటి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేశారు. బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, అచ్చెన్నాయుడు, బీ అశోక్, పయ్యావుల కేశవ్, సత్యప్రసాద్‌, జోగేశ్వరరావు, బుచ్చయ్య చౌదరీ సభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. (నటించడం మా సీఎంకు రాదు: కన్నబాబు)

సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. చర్చకు అడ్డుపడ్డ ప్రతిపక్ష సభ్యులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టుగా కూడా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. సభలో మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ఉండాలని సూచించారు. టీడీపీ సభ్యుడు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని వివరించారు. ఒకసారి క్లారిటీ ఇచ్చాక మళ్లీ అదే అంశంపై మాట్లాడటం సరికాదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. సభలో చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో జరిగిపోతుందని మళ్లీ పోడియం ముందు కూర్చున్నారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు