పాపం ఆయన పేరుకే ప్రెసిడెంట్‌!

16 Nov, 2020 03:40 IST|Sakshi

అచ్చెన్నాయుడుకు అధినేత షాకులు 

ప్రమాణ స్వీకారానికి రానని తేల్చిచెప్పిన చంద్రబాబు 

పార్టీ కార్యాలయంలో నిర్వహణకు ‘నో’ 

సంప్రదించకుండానే రాష్ట్ర కమిటీ నియామకం 

సాక్షి, అమరావతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా అచ్చన్నాయుడుకు అధినేత చంద్రబాబు నాయుడు అప్పుడే షాక్‌ ట్రీట్‌మెంట్‌ ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావించిన అచ్చెన్న ఆశలపై నీళ్లు చల్లినట్టు తెలిసింది. కరోనా సమయంలో తాను ఎక్కడికీ రాలేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. అయినా అంత హడావుడి అవసరం లేదని, కావాలనుకుంటే విజయవాడలో ఎక్కడైనా సింపుల్‌గా చేసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. దీంతో దీపావళికి ముందు భారీగా ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించాలనుకున్న అచ్చెన్న కినుక వహించినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కమిటీని నియమించినప్పుడు చంద్రబాబు తనను కనీసం సంప్రదించలేదని అచ్చెన్న వాపోతున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  

బీసీలను నమ్మించేందుకే... 
అధ్యక్షుడైనంత మాత్రం అచ్చెన్నకు అధికారాలేవీ ఉండవని, పార్టీ కార్యాలయం నుంచి అందే సూచనల ప్రకారమే నడుచుకోవాలని పరోక్షంగా చంద్రబాబు సంకేతాలిచ్చినట్లు సమాచారం. దీంతో టీడీపీలో ఎంత పెద్ద పదవి ఇచ్చినా అది బీసీలను నమ్మించేందుకు ఆడే డ్రామానే అని స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పదవులను కేఈ కృష్ణమూర్తికి ఇచ్చినా ఆయన అధికారాలకు కత్తెర వేయడం గమనార్హం. రాజధాని భూసమీకరణ కార్యకలాపాల నుంచి తప్పించి తనకు కావాల్సిన వాళ్లతో కథ నడిపారు. ఇప్పుడు కూడా అదే బాటలో అచ్చెన్నకు అధ్యక్ష పదవి ఇచ్చి రిమోట్‌ మాత్రం తన కుమారుడి చేతుల్లో ఉంచినట్లు పారీ్టలో చర్చ జరుగుతోంది. (టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు)

మరిన్ని వార్తలు