బరువు తక్కువ డ్రామా! చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ హడావుడి

14 Oct, 2023 03:26 IST|Sakshi

ఆసుపత్రిలో చేర్చేందుకే ‘అనారోగ్యం’ పథకం.. బాబు బరువు తగ్గలేదు.. జైలుకొచ్చాక మరో కిలో పెరిగారు

ఇంటి భోజనం.. మూడు పూట్లా ఆరోగ్య పరీక్షలు.. పూర్తి ఆధారాలతో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన జైళ్ల శాఖ

బాబు జైల్లో.. చినబాబు ఢిల్లీలో.. నైరాశ్యంలో తమ్ముళ్లు

ఇప్పట్లో బెయిల్‌ రాదనే సానుభూతి ఎత్తుగడ

బెడిసికొట్టిన రాజకీయ కుతంత్రం

సాక్షి, అమరావతి: అవినీతికి పాల్పడి సాక్ష్యాధారా­లతో సీఐడీకి దొరికిపోయిన మాజీ సీఎం చంద్ర­బాబు బయటపడే మార్గం కానరాకపోవడంతో అనారోగ్యమంటూ సానుభూతి నాటకానికి తెర తీశారు! స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో విచా­రణకు సహకరించకుండా అసలు కేసునే కొట్టివేయా­లని ఒకవైపు వాదిస్తూ మరోవైపు రాజకీయ ప్రయో­జనాల కోసం సరికొత్త ఎత్తుగడ వేశారు. అడ్డ­గో­లుగా ప్రజాధనాన్ని కాజేసింది కాకుండా తప్పు­లనుకప్పిపుచ్చుకునేందుకు ఆయన చేస్తున్న యత్నా­­లపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. డీ హై­డ్రేషన్‌.. స్కిన్‌ అలర్జీ.. బరువు తగ్గిపోయారంటూ రకరకాల అంశాలను ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు తెరపైకి తెచ్చి హడావుడి చేశారు. 

దీనిపై జైళ్ల శాఖ అధికారులు సత్వరమే స్పందించి వాస్తవాలను బహిర్గతం చేయడం ద్వారా దుష్ప్రచారానికి తెర దించారు. వాస్తవానికి జైలుకు వచ్చినప్పటి కంటే ప్రస్తుతం చంద్రబాబు బరువు మరో కిలో పెరగడం గమనార్హం. చంద్రబాబు తీసుకునే ఆహారం ఇంటి నుంచే వస్తోంది. ఆయనకు ప్రతి రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బయట తిరగడం లాంటి శారీరక శ్రమ ఏమాత్రం లేదు. అలాంటప్పుడు బరువు ఎందుకు తగ్గుతారనే స్పృహ లేకుండా నిస్సిగ్గుగా ఆరోపణలు చేయడంపై అంతా విస్తుపోతున్నారు.  అధికారాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు యథేచ్ఛగా పాల్పడ్డ కుంభకోణాలు వరుసగా బయటపడుతుండటంతో టీడీపీ బెంబేలెత్తుతోంది.

చంద్రబాబు 34 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉండటంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు కాడి వదిలేశారు. మరోవైపు లోకేశ్‌ రాజకీయ కార్యక్షేత్రం కాడి వదిలేసి ఢిల్లీలో తలదాచుకోవడంతో భవిష్యత్‌పై టీడీపీ ఆశలు వదిలేసుకుంది. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఏమాత్రం సానుభూతి కలసి రావడం లేదని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు.

గత్యంతరం లేక ఏదో ఒక ఆందోళన నిర్వహిస్తున్నా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కనిపిస్తున్నారని, సామాన్యులు ఎవరూ ఇందులో పాలు పంచుకోవడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో దింపుడు కళ్లెం ఆశతో టీడీపీ చివరి అస్త్రంగా చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదనే అవాస్తవ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. వైద్యుల నివేదికలు, రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు అధికారుల ప్రకటనతో ఆ యత్నం కూడా బెడిసికొట్టింది.

మొన్ననే బాగున్నారన్న పయ్యావుల..
మూడు రోజులుగా చంద్రబాబుకు అరోగ్యం బాగా లేదంటూ వ్యూహాత్మకంగా ప్రచారాన్ని టీడీపీ తెరపైకి తెచ్చింది. గతవారం రెండో ములాకత్‌తో చంద్రబాబును కలిసిన లోకేశ్, పయ్యావుల కేశశ్‌ మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన వద్దని, చంద్రబాబు పార్టీ కోసం, రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం హఠాత్తుగా చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదంటూ ప్రచారానికి దిగారు. ఎంత పకడ్బందీగా దీన్ని వ్యాప్తిలోకి తెచ్చారంటే.. చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదంటూ నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి వరుసగా ట్వీట్లు పెట్టారు. 

ఆ వెంటనే యనమల రామకృష్ణుడు అందుకున్నారు. అచ్చెన్నాయుడుతోపాటు పార్టీ సీనియర్‌ నేతలు సమావేశమై చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదంటూ ప్రకటనలు చేశారు. చంద్రబాబు ఏకంగా ఐదు కిలోల బరువు తగ్గారని, కిడ్నీలు దెబ్బ తింటాయంటూ తామే వైద్యులమనే తరహాలో హడావుడి చేశారు. బాబు శరీరంపై దద్దుర్లు వచ్చాయని, ఏసీ లేకపోవడంతో ఈ సమస్య వచ్చిందని నిర్ధారించేయడం విస్మయ పరుస్తోంది. చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తేవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనం. 

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుపై గుర్తు తెలియని డ్రోన్లు తిరిగాయని ఆరోపిస్తూ చంద్రబాబు భద్రతపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. వెంటనే ఎయిమ్స్‌ ఆసుపత్రికిగానీ ఏదైనా ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రికిగానీ తరలించాలని డిమాండ్‌ చేశారు. తద్వారా ఆసుపత్రి నుంచి రాజకీయం నెరపవచ్చన్నది టీడీపీ ఉద్దేశం. అందుకోసమే అనారోగ్యం, భద్రతకు ప్రమాదం అంటూ అసత్య ఆరోపణలు ప్రచారంలోకి తెచ్చారు.

మాన్యువల్‌ ప్రకారం సదుపాయాలు
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ కుట్రపూరితంగా చేసిన అసత్య ఆరోపణలను జైళ్ల శాఖ సమర్థంగా తిప్పికొట్టింది. జైలు మాన్యువల్‌లోని నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని వివరించింది. జైళ్ల శాఖ మాన్యువల్‌లోని 1037, 385, 386 నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం వీఐపీ ఖైదీలకు నిర్దేశించిన అన్ని సదుపాయాలను ఆయనకు కల్పిస్తున్నట్లు తెలిపింది. జైలు గదిలో ఫర్నిచర్, ఇతర వసతులను కూడా ఆమేరకు సమకూర్చినట్లు పేర్కొంది. జైళ్ల శాఖ మాన్యువల్‌ ప్రకారం జైలులో ఏసీగానీ ఎయిర్‌ కూలర్‌గానీ కల్పించే వెసులుబాటు లేదని వెల్లడించింది. మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. 

చంద్రబాబు ఉన్న జైలు గదిలో 8 ఫ్యాన్లు ఏర్పాటు చేశామని, న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతిస్తున్నామని తెలిపింది. రోజూ జైలు వైద్య అధికారులు, సిబ్బంది చంద్రబాబును పరీక్షిస్తున్నారని, ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని వెల్లడించింది. సెకండ్‌ ఓపీనియన్‌ కోసం జీజీహెచ్‌ వైద్యులను కూడా పిలిపించి పరీక్షలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యుల నివేదిక కూడా వెల్లడించింది. ఇక జైలుకు వచ్చినప్పటి కంటే ప్రస్తుతం చంద్రబాబు ఒక కేజీ బరువు పెరిగి ప్రస్తుతం 67 కిలోల బరువు ఉండటం గమనార్హం. ఈమేరకు పూర్తి ఆధారాలు, వైద్య పరీక్షల నివేదికలను న్యాయస్థానానికి సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం జైళ్ల శాఖ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. 

బాలయ్య దూకుడుతో..
పూర్తి ఆధారాలతో చంద్రబాబు అవినీతిని వెలికి తీసిన సీఐడీ పకడ్బందీగా కేసులు నమోదు చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం కేసులో చంద్రబాబు రిమాండ్‌ ఖైదీగా జైలులో ఉండగా ఫైబర్‌నెట్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్ల అల్లర్ల కేసులు వెయిటింగ్‌ లిస్టులో ఉన్నాయి. మరోవైపు అమరావతిలో అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసు కూడా ఉంది. సీఆర్‌పీసీ, అవినీతి నిరోధక చట్టాల్లోని సెక్షన్లకు వక్రభాష్యం చెబుతూ ఢిల్లీ నుంచి రప్పించిన న్యాయవాదులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్‌ రావడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. పోనీ చినబాబును పట్టుకుని రాజకీయ గోదారి ఈదుదామనుకుంటే ఆయనేమో కేసుల భయంతో దేశ రాజధానిలో దాక్కున్నారు. ఇదే అవకాశంగా టీడీపీలో ఆధిపత్యం కోసం నందమూరి బాలకృష్ణ దూకుడుగా వ్యవహరించడం నారా కుటుంబాన్ని బెంబేలెత్తించింది. దాంతో తెలంగాణ ఎన్నికల సాకుతో బాలయ్యను ఆ రాష్ట్రానికే పరిమితం చేశారు. 

కిలో బరువు పెరిగారు: జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ తెలిపారు. జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హై ప్రొఫైల్‌ ఖైదీ అయినందున తొలి రోజే ఆయనకు స్నేహ బ్యారక్‌ను కేటాయించామని గుర్తు చేశారు. ఆయన వద్ద 24 గంటలూ ఒక హెడ్‌ వార్డర్, ఆరుగురు వార్డర్లుంటారని, ఒక జైలర్‌ స్థాయి అధికారి విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఆయనకు వచ్చే ఆహారం, ఇతరత్రా అన్నీ ఆయనే తనిఖీ చేసి చంద్రబాబుకు అందిస్తారని తెలిపారు. 

ములాఖత్‌కు చంద్రబాబు బయటకు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర ఖైదీలు, ఇతరులు ఆ ప్రాంతంలోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీతో వారానికోసారి భద్రతపై చర్చిస్తున్నామన్నారు. చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటున్నారని స్పష్టం చేశారు. ఖైదీలతో చంద్రబాబుకు ఇబ్బందులు వస్తున్నాయన్న వార్తలు అవాస్తవమని చెప్పారు.  

రోజుకు మూడుసార్లు పరీక్షలు..
చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం, మందుల వివరాలను సేకరించామని డీఐజీ తెలిపారు. జైలులో వైద్యాధికారులు చంద్రబాబుతో మాట్లాడమే కాకుండా ఆయనకు చికిత్స అందించిన వ్యక్తిగత వైద్యుడితోనూ సంప్రదించినట్లు చెప్పారు. ఆయన మందులు వేసుకుంటున్నారా లేదా? అనేది జైలు వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు మూడుసార్లు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. జైలుకు వచ్చినప్పుడు చంద్రబాబు 66 కేజీల బరువు ఉండగా ప్రస్తుతం 67 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. బరువు తగ్గిపోయారంటూ వస్తున్న తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. 

రెండు రోజుల క్రితం డీహైడ్రేషన్‌ అని తెలియజేయగానే వైద్యాధికారులతో మాట్లాడి తగిన లిక్విడ్‌లు ఇచ్చినట్లు చెప్పారు. చర్మంపై దద్దుర్లకు సంబంధించి అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వైద్య పరీక్షలు చేశారని, అవేమీ ప్రమాదరకర స్థాయిలో లేవన్నారు. చంద్రబాబు గదిలో 8 ఫ్యానులతో పాటు దోమ తెర కూడా ఏర్పాటు చేశామన్నారు. జైల్లోకి వచ్చినప్పుడు వెంట తెచ్చుకున్న మందులను ఆయన కొనసాగిస్తున్నారని వివరించారు.  

తప్పుడు వార్తలపై చర్యలు 
చంద్రబాబుకు ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌కు సంబంధించి కోర్టు సీలు, న్యాయమూర్తి సంతకం లేనందున వివరణ కోరినట్లు డీఐజీ తెలిపారు. సెంట్రల్‌ జైల్లో 2,039 మంది ఖైదీలున్నారని, వారిలో చంద్రబాబు ఒకరని, రిమాండ్‌ ఖైదీ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో  అలానే తీసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు కోరిక మేరకు ఆయనను ప్రత్యేకంగా ఆస్పత్రికి పంపలేమన్నారు. తమపై ఒత్తిళ్లు ఉన్నాయని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. సోషల్‌ మీడియా, పత్రికల్లో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకుంటామని రవికిరణ్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు