చంద్రబాబు జీవితమే అక్రమ రాజకీయం

26 Sep, 2023 05:27 IST|Sakshi

మోసాలు, అన్యాయాలతోనే ఆయన రాజకీయాలు..

రాజకీయాలను డబ్బుమయం చేసింది చంద్రబాబే!

అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు, ఆయన కుటుంబ సభ్యులు ప్రజా ధనాన్ని లూటీ చేశారు..

ఇక్కడ రాజకీయ కక్ష సాధింపునకు ఆస్కారమే లేదు!

అసెంబ్లీలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: చంద్రబాబు జీవితాంతం అన్యాయాలు, అక్రమాలు, మోసాలతోనే రాజకీయాలు చెలాయించారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం ప్రశ్నోత్తరాల అనంతరం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో రాజకీయాలను డబ్బు మయం చేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు. ఇక్కడ దొరికినవి ఒకట్రెండు స్కామ్‌లేనని.., అధికారంలోకి రాగానే ప్రజా ధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అనేక తప్పిదాలకు పాల్పడ్డారని ఆరోపించారు.  

ప్రజా ఖజానా నుంచి డబ్బును విపరీతంగా దోచుకున్నారని చెప్పారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు కుటుంబ సభ్యులూ ఏం మాట్లాడట్లేదన్నారు. కొడుకు ఢిల్లీలో కూర్చుంటే.. మద్దతిస్తానని వచి్చన వ్యక్తి ఎక్కడున్నారో తెలీదని, చంద్రబాబుకు మద్దతే కరవైందని ఎద్దేవా చేశారు. న్యాయస్థానం తగిన ఆధారాలతోనే చంద్రబాబు వేసిన ప్రతి పిటిషన్‌ను తిరస్కరిస్తోందని, కేసులో బలం, తీవ్రతకు ఇది అద్దం పడుతోందని చెప్పారు.

దీనిద్వారా స్కిల్‌ స్కామ్‌పై ఆధారాలతో సహా దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరన్న విషయం ప్రపంచానికి అర్థమైందన్నారు. ప్రభుత్వానికి రాజకీయంగా క్షక్ష సాధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల విచారణలో సీఐడీకి చంద్రబాబు సహకరించలేదని, కోర్టుకు మాత్రం సహకరించానంటూ అసత్యాలు చెబుతున్నారని అన్నారు. అంతకుముందు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు ముగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రశాంత వాతావరణంలో సంపూర్ణంగా ప్రశ్నోత్తరాలు పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. ప్రశ్నలు అడిగిన సభ్యులు సభలో ఉన్నా, లేకున్నా.. ప్రజలకు సమాధానాలు అందించడంలో సభ తన కర్తవ్యాన్ని నిష్పాక్షికంగా నెరవేర్చిందన్నారు. దీనికి మంత్రి అంబటి స్పందిస్తూ.. ప్రశ్నోత్తరాలు ప్రశాంతంగా జరగడం శుభ పరిణామమన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోవడం బాధాకరమన్నారు. స్కిల్‌ స్కామ్‌పై చర్చించాల్సి వస్తుందనే భయంతోనే టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రెండు రోజులు చిత్రవిచిత్ర విన్యాసాలు చేసి ఈలలు ఊదుకుంటూ పారిపోయారని అన్నారు.

మరిన్ని వార్తలు