ఐహెచ్‌ఐపీతో అంటువ్యాధులకు చెక్‌!

10 Jul, 2022 05:31 IST|Sakshi

ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫాంను సమర్థంగా వినియోగిస్తున్న వైద్య శాఖ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంటువ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు వైద్య శాఖ చర్యలు చేపట్టింది. ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫాం(ఐహెచ్‌ఐపీ)ను వినియోగించడం ద్వారా అంటువ్యాధులు విస్తరించకుండా చూస్తోంది. డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా, డయేరియా తదితర 33 రకాల కేసుల వివరాలను ఐహెచ్‌ఐపీలో నమోదు చేయించి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలోని 7,305 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, 1,956 ప్రభుత్వాస్పత్రులు, 1,910 ప్రభుత్వ ల్యాబ్‌లను ఐహెచ్‌ఐపీ పోర్టల్‌కు మ్యాపింగ్‌ చేశారు.

తొలుత ఏఎన్‌ఎం స్థాయిలో అనుమానిత లక్షణాలున్న వారి వివరాలను నమోదు చేస్తున్నారు. రెండో స్థాయిలో ఆస్పత్రిలో, మూడో స్థాయిలో ల్యాబ్‌లో నిర్ధారణ అయిన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. గత వారం రోజుల్లో విలేజ్‌ క్లినిక్‌ స్థాయిలో 94 శాతం, ఆస్పత్రుల్లో 98 శాతం, ల్యాబ్‌లలో 97 శాతం కేసుల వివరాలను పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఈ వివరాల ఆధారంగా అధికంగా అంటు వ్యాధులు నమోదైన ప్రాంతాలను వైద్య శాఖ హాట్‌ స్పాట్‌లుగా గుర్తిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధుల నియంత్రణకు చర్యలు చేపడుతోంది.  

సచివాలయాల మ్యాపింగ్‌కూ చర్యలు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంలను నియమించింది. వీరి ద్వారా ప్రజలకు ఆరోగ్య కార్యక్రమాలను మరింత చేరువ చేసింది. ఈ క్రమంలో ఐహెచ్‌ఐపీలో సచివాలయాలను కూడా మ్యాపింగ్‌ చేస్తే.. ఆ స్థాయిలోనే అంటువ్యాధుల వ్యాప్తిని గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని వైద్య శాఖ భావిస్తోంది.

ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యాధికారులు ఇటీవల కేంద్ర వైద్య శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కేంద్ర వైద్య శాఖ నుంచి సానుకూల స్పందన లభించినట్లు అధికారులు చెప్పారు. వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఏడీ డాక్టర్‌ రామిరెడ్డి మాట్లాడుతూ.. ఐహెచ్‌ఐపీ వల్ల అంటువ్యాధులు విస్తరించకుండా అరికట్టవచ్చన్నారు. అలాగే ప్రస్తుత సీజన్‌లో నమోదైన కేసుల ఆధారంగా.. వచ్చే సీజన్‌లో వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కార్యాచరణ కూడా రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు