పేరెంట్స్‌ నిర్లక్ష్యం చేస్తే Animal లా మారతారా? 

24 Dec, 2023 08:21 IST|Sakshi

‘మాకు ఒక్కడే కొడుకు. చిన్నప్పటి నుంచీ వాడికి కావాల్సినవన్నీ చేశాం. ఇక్కడే బీటెక్‌ చేశాడు. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడే జాబ్‌ చేస్తున్నాడు. వాడికీ నాకూ మధ్య కమ్యూనికేషన్‌ చాలా తక్కువ. ఏదైనా వాళ్లమ్మతోనే చెప్తాడు. కానీ మొన్నీ మధ్య విడుదలైన యానిమల్‌ మూవీ చూశాక నాకు కాల్‌ చేశాడు. చిన్నప్పుడు తనను నేను పట్టించుకోకపోవడం వల్లే తన జీవితం నాశనమైందని గొడవ పడ్డాడు. ‘అదేంట్రా.. నీకు కావాల్సినవన్నీ చేశా కదా.

బాగా చదువుకుని అమెరికాలో జాబ్‌ చేస్తున్నావు. నీ జీవితం నాశనమైంది ఎక్కడ్రా?’ అని చెప్పినా వినడం లేదు. ‘చిన్నప్పుడు నన్ను నువ్వు అస్సలు పట్టించుకోలేదు. బాగా తిట్టావ్, కొట్టావ్‌. అందుకే నేను ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్రావర్ట్‌నయ్యాను. ఇప్పుడు ఇక్కడ రోజూ ఆల్కహాల్‌ తాగుతున్నా’ అని బాంబు పేల్చాడు. వాడితో ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడి మాటల తర్వాత నేను కూడా ఆ సినిమా చూశా.

నిజంగా పిల్లలను నెగ్లెక్ట్‌ చేస్తే ఫలితాలు అంత తీవ్రంగా ఉంటాయా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను’ కాంతారావు ఆందోళన, ఆవేదన, సందేహమూనూ! యానిమల్‌ మూవీ చూసిన చాలామంది ఇలాంటి ఆందోళననే వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను పట్టించుకోకపోవడం, కొట్టడం, తిట్టడం వల్ల దుష్పరిణామాలు నిజమే అయినా.. నాటకీయత కోసం ఆ సినిమాలో చాలా ఎక్కువ చేసి చూపించారు.

అయితే సమస్యేమీ లేదంటారా?
సమస్యేమీ లేదనడం లేదు. పిల్లలపై సినిమాల ప్రభావంకంటే తల్లిదండ్రుల ప్రభావమే ఎక్కువని గుర్తించమంటున్నా. పిల్లలను నిర్లక్ష్యం చేయడం, కొట్టడం, తిట్టడంలాంటి చర్యల ఫలితాలు అందరికీ ఒకే విధంగా ఉండవు. కొందరు ఆ పరిస్థితులతో సర్దుకుపోతారు, కొందరు పట్టించుకోరు. కానీ సున్నితమైన మనసున్న పిల్లలు మనసులోకి తీసుకుని తీవ్రంగా బాధపడతారు. మానసిక సమస్యల పాలవుతారు. ఎవరు ఎలా స్పందిస్తారనేది ఆ పిల్లల జీన్స్‌, కుటుంబ పరిస్థితులు, ఎదురైన అనుభవాలు, వాటిని చూసే విధానంపై ఆధారపడి ఉంటుంది.

బాల్యంలో నిర్లక్ష్యానికి గురికావడం వల్ల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇతరులను విశ్వసించలేరు. నిరాశ, ఆందోళన, అటాచ్‌మెంట్‌ సమస్యలు రావచ్చు ∙హఠాత్తుగా ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగాలను, ప్రవర్తనను నియంత్రించుకోవడంలో ఇబ్బందులు పడతారు. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.శారీరక హింసను ఎదుర్కొన్న పిల్లల్లో యాంగ్జయిటీ, డిప్రెషన్, పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్, మాదక ద్రవ్యాల వినియోగానికి దారితీయవచ్చు.

ఎమోషనల్‌ అబ్యూజ్‌ వల్ల యాంగ్జయిటీ, డిప్రెషన్‌తో పాటు పర్సనాలిటీ డిజార్డర్స్‌కు గురికావచ్చు. సెక్సువల్‌ అబ్యూజ్‌ వల్ల ఆత్మహత్య ఆలోచనలు, డిసోసియేషన్, ఈటింగ్‌ డిజార్డర్స్‌కు లోనవ్వచ్చు. దీర్ఘకాలం అబ్యూజ్‌కు గురైన పిల్లల్లో పర్సనాలిటీ డిజార్డర్స్‌ వచ్చే అవకాశాలున్నాయి. అంటే కొన్ని సమస్యలు వారి వ్యక్తిత్వంలో భాగంగా మారిపోతాయి.

పేరెంటింగ్‌ కీలకం..
బాల్యం జీవితానికి పునాదిలాంటిది. అందుకే అది దృఢంగా, సంతోషకరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల జీవితాలను ఉల్లాసభరితంగా తీర్చిదిద్దాలి. సరైన తీరులో పెంచడం ద్వారా పిల్లల్లో మానసిక సమస్యలు, వ్యక్తిత్వ లోపాలను నిరోధించవచ్చు. అందుకు ఏం చేయాలంటే...

పిల్లలతో ఎంత సమయం గడిపామనే దానికంటే ఎలా గడిపామనేది ముఖ్యం. పిల్లలతో క్వాలిటీ టైమ్‌ గడపండి ∙శారీరకంగా, మానసికంగా సురక్షితంగా భావించే ఇంటి వాతావరణాన్ని సృష్టించండి. మంచిగా మాట్లాడటం, కౌగలించుకోవడం ద్వారా మీ ప్రేమ, ఆప్యాయతలను తరచుగా వ్యక్తపరచండి. పిల్లల భావాలు, అనుభవాలు సానుకూలమైనవైనా, ప్రతికూలమైనవైనా మీతో పంచుకునేలా ప్రోత్సహించండి.

వారి మాటలను ఎలాంటి జడ్జ్‌మెంట్‌ లేకుండా వినండి ∙మీ సొంత భావాలు, అనుభవాల గురించి వారి వయస్సుకు తగిన విధంగా పిల్లలతో పంచుకోండి ∙పిల్లల ప్రవర్తనకు స్పష్టమైన నియమాలు, సరిహద్దులను ఏర్పాటు చేయండి. వాటి వెనుక ఉన్న కారణాన్ని వివరించండి. వాటిని స్థిరంగా అమలు చేయండి. తప్పు చేసినప్పుడు శిక్షించడం కంటే మంచి ప్రవర్తనను మెచ్చుకోవడంపై దృష్టిపెట్టండి.

పెద్దలను గమనించడం, అనుకరించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మీ మాటలు, చర్యలను గమనించుకోండి. పిల్లల్లో మీరు చూడాలనుకుంటున్న దయ, గౌరవం, సానుభూతి, బాధ్యతలను మీరు చూపిస్తూ రోల్‌ మోడల్‌గా నిలవండి. ఇతరులతో సానుకూల సంబంధాలు ఏర్పరచుకోవడంలో సహాయపడండి.

సంఘర్షణలను పరిష్కరించుకోవడం నేర్పండి. మీ అభిరుచులను పిల్లలపై రుద్దకుండా వారి అభిరుచులను గుర్తించి ప్రోత్సహించండి. వారి స్కిల్స్‌ పెంచుకోవడానికి అవకాశాలను కల్పించండి. మీ పిల్లల ప్రవర్తనలో లేదా భావోద్వేగాలలో మార్పులు గమనిస్తే సైకాలజిస్ట్‌ సహాయం తీసుకోండి. -సైకాలజిస్ట్‌ విశేష్‌,psy.vishesh@gmail.com

>
మరిన్ని వార్తలు