తిరుపతిలో అత్యాధునిక చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

13 Mar, 2021 04:45 IST|Sakshi
అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్న సంజయ్‌ కె.సింగ్, టీటీడీ చైర్మన్, ఈవో

రూ.300 కోట్లతో నిర్మాణం 

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి 

ఈవో, యూఐసీ సీఈవోల మధ్య అవగాహన ఒప్పందం 

తిరుమల/తిరుపతి ఎడ్యుకేషన్‌(చిత్తూరు జిల్లా): తిరుపతిలో అత్యాధునిక వసతులతో చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ముంబైకి చెందిన దాత, ఉద్వేగ్‌ ఇన్‌¯Œఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ కన్సల్టెన్సీ ప్రయివేట్‌ లిమిటెడ్‌(యూ.ఐ.సీ) సంస్థ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కె.సింగ్‌ ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో దీనిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, సంజయ్‌ కె.సింగ్‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ చిన్న పిల్లలకు అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో చిన్న పిల్లల ఆస్పత్రులు నిర్మించాలని సీఎం వైఎస్‌ జగ¯న్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు తెలిపారు. ఈ మేరకు తిరుపతిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించిందన్నారు. ఈవో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న ఈ ఆస్పత్రి స్విమ్స్‌కు అనుబంధంగా పని చేస్తుందని చెప్పారు. 

విద్యార్థులకు మెరుగైన వైద్యం
కరోనా సోకిన వేద పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ లేదని, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలను ఆయన తనిఖీ చేయడంతో పాటు, స్విమ్స్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుమల వేద పాఠశాల విద్యార్థులు, అధ్యాపకుడిని టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో కలిసి ఆయన పరామర్శించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

మరిన్ని వార్తలు