Chittoor Bus Accident: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!

27 Mar, 2022 10:16 IST|Sakshi

సాక్షి, తిరుపతి: అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్‌ కమిషనర్‌ ఎం.బసిరెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఘాట్ రోడ్‌లో మలుపు గుర్తించకుండా స్ట్రెయిట్‌గా వెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు.

చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి..

చెప్పినా డ్రైవర్‌ వినలేదు: పెళ్లికొడుకు వేణు
బస్సు డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు. అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమ‍ని పెళ్లికొడుకు వేణు అన్నారు. స్పీడ్‌గా వెళ్లొద్దంటూ చెబుతున్నా డ్రైవర్‌ వినలేదని.. ఓవర్‌ స్పీడ్‌ కారణంగా బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందన్నారు. రూయాలో 32 మంది, స్విమ్స్‌లో ఏడుగురు, బర్డ్‌ ఆసుపత్రిలో ఆరుగురికి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌  తెలిపారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అర్బన్‌ ఎస్పీ తెలిపారు.

మృతులు వీరే..
ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు.ప్రమాద సమయంలో 55 మంది బస్సులో ఉన్నారు. రసూల్‌(డ్రైవర్‌), మలిశెట్టి వెంగప్ప, గణేష్‌, కాంతమ్మ, మురళీ, యశస్విని, ఆదినారాయణ, బస్సు క్లీనర్‌ మృతి చెందారు.
 

మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు సాయం..
బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అంతేకాకుండా బాధితులు కోలుకునేంతవరకూ క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు