జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక! 

20 Aug, 2023 04:39 IST|Sakshi

రాజ్యాంగ సవరణ యోచనలో కేంద్రం 

రాష్ట్రాలతో చర్చకు వచ్చే నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో వర్క్‌షాప్‌ 

అన్ని రాష్ట్రాల అధికారులు,  ప్రజాప్రతినిధులతో కలిపి  261 మందికి ఆహ్వానం 

ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, సర్పంచికి అవకాశం 

ప్రస్తుతం పరోక్ష పద్దతిలో జెడ్పీ చైర్మన్, ఎంపీపీల ఎన్నిక 

సాక్షి, అమరావతి : జెడ్పీ చైర్‌పర్సన్, మండలాధ్యక్ష పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. అవసరమైతే రాజ్యాంగంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఉద్దేశించిన ఆర్టికల్‌ 243 (సీ) క్లాజ్‌ 5 (బీ)కి సవరణలు చేయాలని ఆలోచన చేస్తోంది.

ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం ఉండే అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చించేందుకు వచ్చే నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని జాతీయ పంచాయతీరాజ్‌ శిక్షణ సంస్థలో ఈ ప్రత్యేక వర్క్‌షాప్‌ జరుగుతుంది.

ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ అడిషనల్‌ సెక్రటరీ చంద్రశేఖర్‌కుమార్‌ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), పంచాయతీరాజ్‌ శాఖ విభాగాధిపతులకు ఇటీవల లేఖలు కూడా రాశారు.  

కేంద్రం సవరణ చేసినా, సగం రాష్ట్రాలు ఆమోదం తర్వాతే అమల్లోకి 
ఒకవేళ.. కేంద్రం ఇప్పుడు దేశమంతటా జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నుకొనేలా రాజ్యాంగ సవరణ చేసినా.., అది అమలులోకి రావాలంటే సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలని పంచాయతీరాజ్‌ శాఖ అదికారులు చెప్పారు. అన్ని దశల ప్రక్రియ పూర్తవడానికి చాలా కాలం పడుతుందని తెలిపారు.  

రాష్ట్రం  నుంచి 9 మంది.. అన్ని రాష్ట్రాల నుంచి 261 మంది.. 
ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని సూచనలు చేసేందుకు అన్ని రాష్ట్రాల నుంచి జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ సర్పంచుల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేయాలని కేంద్రం లేఖలో పేర్కొంది. వీరితో పాటు రాష్ట్రాల పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు (చాలా రాష్ట్రాల్లో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ – బీడీవోలు అంటారు), రాష్ట్రాల్లోని  పంచాయతీరాజ్‌ శాఖ శిక్షణ సంస్థ ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి మొత్తం 9 మంది హాజరవనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు.  

1995కి ముందు ఆ పదవులకు రాష్ట్రంలోనూ  ప్రత్యక్ష ఎన్నికలే.. 
రాష్ట్రంలో ప్రస్తుతం జెడ్పీ చైర్మన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నుకొంటున్నారు. 1995కి ముందు కొంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పదవులకు ప్రత్యక్ష పద్దతిలోనే నేరుగా ప్రజలే ఎన్నుకొనేవారు. స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తూ 1994లో కేంద్రం తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఎన్నికల విధివిధానాల్లో మార్పులు చేశారు. దాని ప్రకారం పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని నిర్దేశించారు.

గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు మాత్రం రాష్ట్రాల ఇష్టానుసారం  ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవచ్చని కేంద్రం ఆ సవరణల్లో పేర్కొంది. ఈ సవరణల మేరకు అన్ని రాష్ట్రాలు రాష్ట్రస్థాయిలో కొత్త పంచాయతీరాజ్‌ చట్టాలను తీసుకొచ్చాయి. ఆ మేరకు మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచిని ప్రత్యక్ష విధానంలో, జెడ్పీ చైర్‌పర్సన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ద్వారా ఎన్నుకొనేలా 1995లో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చిం ది.  

మరిన్ని వార్తలు