భూమి లేని పేదలకు అండగా ఉంటాం.. కౌలురైతుకు వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్‌

1 Sep, 2023 13:48 IST|Sakshi

సాక్షి, గుంటూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఉద్ఘాటించారు. భూమి లేని పేదలకు సైతం తమ ప్రభుత్వం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారాయన. శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా తొలి విడుత నిధుల జమ కార్యక్రమం జరిగింది. 

‘‘దేవుడి దయతో  ఇవాళ రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. అందులో మొదటిది కౌలు రైతులకు సంబంధించి.. వారితో పాటు దేవాదయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు కూడా 2023-24 తొలివిడత పెట్టుబడి సాయం రూ.7,500 అందిస్తున్నాం. రెండో మంచి కార్యక్రమం.. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఆ సీజన్‌లో జరిగిన నష్టాన్ని.. ఆ సీజన్‌ ముగిసేలోపే పరిహారం రైతన్నల చేతులో పెడుతున్నాం. 

దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా  ఎక్కడా లేదేమో. ఏ వ్యవసాయ భూమి లేని నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. ప్రతీ వాళ్లకు నా అని సంభోదిస్తూ అందరికీ అండగా నిలబడుతున్న ప్రభుత్వం ఇది. అందులో భాగంగానే ఈరోజు కౌలు రైతులుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రైతులకు అండగా నిలబడుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా అరణ్యభూములు సైతం సాగు చేసుకునే గిరిజనులకు తోడుగా ఉండే కార్యక్రమం ఇది’’ అని సీఎం జగన్‌ మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో.. 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేస్తున్నాం.  దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తోంది. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, అలాగే.. దేవదాయ భూము­లను సాగు చేస్తున్న రైతులకు సాయం పంపిణీ చేస్తోంది.  2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం ఇది అని తెలియజేశారాయన.

ఇప్పటివరకు..
50 నెలల కాలంలో 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు (ఆర్వో­ఎఫ్‌ఆర్‌ పట్టాదారులు) మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించింది(నేటి సాయంతో కలిపి). ఇక మొత్తంగా వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేయగలిగామని అందించామని సీఎం జగన్‌ తెలిపారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్రంలో అర హెక్టారులోపు ఉన్న రైతులు దాదాపు 60 శాతం ఉన్నారు. 
ఒక హెక్టారు దాకా దీన్ని తీసుకుపోతే 60 శాతా కాస్తా 70 శాతం పైచిలుకు దాకా పోతోంది. 
రూ.13,500 పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం. ఈ సొమ్ము 60 శాతం మంది రైతులు అందరికీ 80 శాతం పంటలకు 80 శాతం పెట్టుబడి సాయంగా అందుతోంది. 
దీని వల్ల వాళ్లు బయట అప్పులు చేసుకోవాల్సిన అవసరం రాదు. కరెక్టుగా మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇస్తున్నాం. 
పంట వేసే టయానికి, కోసేటప్పుడు వాళ్ల చేతిలో డబ్బులు పడే సరికి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి నష్టపోకుండా వ్యవసాయం చేయగలిగే పరిస్థితి వచ్చింది. 

► వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ అనే ఒక్క కార్యక్రమం ద్వారా రూ.13,500 అన్నది హెక్టారులోపు ఉన్న 70 శాతం మంది రైతులకు ఎంతో మేలు చేస్తోంది. 
ఇన్‌పుట్‌సబ్సిడీకి సంబంధించి మొన్న వర్షాల వల్ల గోదావరి, భారీ వరదలు వచ్చాయి. 
► ఈ సీజన్‌ ముగిసేలోగానే 4,879 హెక్టార్లలో రకరకాల పంటలు ఆగస్టులోపు నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీగా ఈరోజు రూ.11 కోట్లు వాళ్ల చేతిలో కరెక్టుగా సమయానికి పెట్టడం జరుగుతోంది. 
► ఈ గొప్ప కార్యక్రమం ద్వారా రూ.1,977 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఇస్తూ రైతు నష్టపోకుండా చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం.  దాంతోపాటు ఇప్పటికే 38 కోట్లు ఫ్లడ్‌ రిలీఫ్‌లో భాగంగా వాళ్లందరికీ సాయం చేశాం. 
వరదల వల్ల నష్టపోయిన రైతన్నలకు నారుమడులు, నాట్లు వేసిన పొలాల రైతులందరికీ వెనువెంటనే వారిని ఆదుకుంటున్నాం.
పంటలు వేసుకొనేందకు 80 శాతం రాయితీతో వరి విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇప్పటికే సరఫరా చేసి తోడుగా నిలబడగలిగాం. 
రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలోనే ఎలాంటి విప్లవాత్మక మార్పులు మన రాష్ట్రంలో చూడగలిగాం అని గమనిస్తే..
కళ్ల ఎదుటనే కనిపించే కొన్ని విషయాలు మీ అందరికీ అర్థమయ్యేట్లుగా చెప్పదలచుకున్నా.
ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే వ్యవస్థ మన కళ్లెదుటే కనిపిస్తోంది. 

గ్రామ స్థాయిలో సచివాలయం, పక్కనే 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి.
అక్కడే అగ్రికల్చరల్‌ గ్రాడ్యుయేట్‌ ఉంటారు. సహాయ సహకారాలు అందిస్తూ, చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. 
బ్యాంకింగ్‌ సేవలు, కియోస్క్‌ అక్కడే ఉంది. కల్తీ లేని విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే గొప్ప వ్యవస్థ.
ఈక్రాప్‌ వ్యవస్థ అమలవుతోంది. ఏ పంట  ఎవరు వేశారనే ఫిజికల్‌ డిజిటల్‌ అక్నాలెడ్జ్‌మెంట్ తెస్తున్నాం. 
సోషల్‌ ఆడిట్‌లో డిస్‌ప్లే అవుతోంది. మంచి జరగకుంటే ఎలా కంప్లయింట్‌ చేయాలనేది అక్కడే రాసుంది. 
వెంటనే రీ వెరిఫై చేసి నష్టం జరగకుండా చేసే కార్యక్రమం జరుగుతోంది. 
ఆర్బీకేలో కనీస గిట్టుబాటు ధర డిస్‌ప్లే చేసి తక్కువ ధరకు పడిపోతే ఆర్బీకేలు ఇంటర్‌ఫియర్‌ అయ్యి రైతుకు సాయంగా పంట కొనుగోలు చేస్తున్నారు. 

ధాన్యం కొనుగోలు అయితే ఎంఎస్‌పీ రాని పరిస్థితి నుంచి ఎంఎస్‌పీ ఇవ్వడమే కాకుండా, గన్నీ బ్యాగ్స్, లేబర్‌ ట్రాన్స్‌పోర్టు ఖర్చు ఎకరాకు రూ.10 వేల చొప్పున అదనంగా రైతుల చేతుల్లోకి అందుబాటులోకి వస్తోంది. 
పంట నష్టపోయిన అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే అడుగులు నాలుగేళ్లలో పడ్డాయి. 
ఏ పంట వేసినా ఈ క్రాప్, ఇన్సూరెన్స్‌ నమోదవుతోంది. 
రైతులు కట్టాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతోంది. 
రైతులకు ఉచిత పంటల బీమా 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. 
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పగటిపూటే 9 గంటలు కరెంటు ఇవ్వాలంటే రూ.1,700 కోట్లు పెట్టి ఫీడర్లు అప్‌గ్రేడ్‌ చేయాలని డిపార్ట్‌మెంట్‌ చెబితే ఆ డబ్బు పెట్టి ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేసి పగటిపూటే కరెంటు ఇస్తున్నాం.. ఇవన్నీ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి.

రైతుకు సాగు ఒక్కటే కాకుండా అదనపు ఆదాయం రావాలంటే వ్యవసాయం ఒక్కటే కాకుండా గేదెలు, ఆవులు కూడా రైతులకు తోడుగా ఉండాలి.
వాటిలోంచి వచ్చే ఆదాయం మెరుగ్గా ఉండాలని, సహకార రంగంలో గొప్ప మార్పు తెస్తూ అమూల్‌ను తీసుకొచ్చాం. 
ఏకంగా 8 సార్లు అమూల్‌ వచ్చిన తర్వాత రేటు పెరిగింది. 
లీటరు గేదె పాలు రూ.22, ఆవు పాలు లీటరుకు రూ.11 పెరిగింది. 

కేవలం ఈ నాలుగు సంవత్సరాల మనందరి ప్రభుత్వంలో జరిగిన మార్పులకు తార్కాణం.  ఈరోజు చేస్తున్నవి కూడా అందులో భాగంగా కొనసాగిస్తున్నాం. రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ బటన్‌ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని బటన్‌ నొక్కి నిధుల్ని విడుదల చేశారు సీఎం జగన్‌.

మరిన్ని వార్తలు