సీఎం జగన్‌ ఆపన్న హస్తం

12 Nov, 2023 04:19 IST|Sakshi

కష్టాలు చెప్పుకొన్న వ్యాధిగ్రస్తులకు భరోసా 

గంటల వ్యవధిలో ఆర్థిక సాయం 

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వం చాటుకు­న్నారు. భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నగరానికి వచ్చిన ఆయన.. తిరిగి వెళుతున్న సమయంలో స్టేడియం వద్ద పలువురు వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు కలిసి తమ పిల్లల అనారోగ్య సమస్యలు చెప్పుకుని ఆదుకోవాలని వేడుకున్నారు. వారి సమస్యలు విన్న సీఎం వైఎస్‌ జగన్‌.. తక్షణమే వారికి ఆర్థిక సాయం అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్‌ను ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు జాయింట్‌ కలెక్టర్‌ గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున రూ.4 లక్షల చెక్కును అందించారు. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, వైఎస్సార్‌ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌ చేతులు మీదుగా ఈ సాయం అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మాచవరానికి చెందిన సాయితేజ తండ్రి ముసలయ్య, విద్యాధరపురానికి చెందిన జగదీష్‌ తల్లి టి.ఉష, బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న కండ్రిక గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ తల్లి నాగమణి, విజయవాడ దుర్గాపురానికి చెందిన సుకీర్తి చికిత్స కోసం తల్లి కరుణలు చెక్కులు అందుకున్నారు.

మరిన్ని వార్తలు