సిరివెన్నెల మృతిపై సీఎం జగన్‌ సంతాపం

30 Nov, 2021 17:09 IST|Sakshi

AP CM YS Jagan Mourns On Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌.. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు.

చదవండి: సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..?


సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు: సీఎం కేసీఆర్‌

ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ చంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సాహిత్య లోకానికి తీరని లోటు: విశ్వభూషన్ హరిచందన్
ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల కలం నుంచి ఆణిముత్యాల వంటి గీతాలు జాలువారాయన్నారు. 

తెలుగు సినీ గేయ ప్రపంచంలో ఆయన అక్షర నీరాజనాన్ని ఎవ్వరూ మరువలేరన్నారు. తెలుగు చరిత్రలో ఆయన పాటలు, మాటలు సజీవంగా నిలిచి పోతాయని గవర్నర్ ప్రస్తుతించారు. సిరివెన్నెల  ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్న గవర్నర్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు: అవంతి
‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు. తెలుగు సినిమా సాహిత్యానికి సొబగులు అద్దిన దిగ్గజ సినీ గేయరచయిత ‘సిరివెన్నెల’.. సీతారామశాస్త్రి మృతి సాహితీ ప్రియులు, సినీ ప్రేమికులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం’ అన్నారు మంత్రి అవంతి.

సిరివెన్నెల జాతీయ భావజాలం కలిగిన కవి: కిషన్‌రెడ్డి
‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత సన్నిహితులు. జాతీయ భావజాలం కలిగిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. 1985 నుంచి ఆయన నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. 15 రోజుల కిందటే ఆయన నాకు జాతీయ గీతాల సీడీ ఇచ్చారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది’’ అన్నారు కేంద్ర పర్యటక మంత్రి కిషన్‌ రెడ్డి.

మరిన్ని వార్తలు