దిశ కాల్‌సెంటర్లు: అదనపు సిబ్బంది నియామకానికి గ్రీన్‌సిగ్నల్

2 Jul, 2021 16:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: దిశ కాల్‌సెంటర్లలో అదనపు సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మహిళల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడొద్దన్న ఆయన.. దిశ పెట్రోలింగ్ కోసం కొత్తగా 145 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ శుక్రవారం ‘దిశ’ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 6 కొత్త దిశ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు త్వరగా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి, విశాఖలో ల్యాబ్‌ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇక ఫొరెన్సిక్ ల్యాబ్‌ల్లో ఇప్పటికే 58 పోస్టుల భర్తీకాగా... మరో 61 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు.

అదే విధంగా గంజాయి రవాణా, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్న ఘటనల్లో.. నిజాలను ప్రజల ముందుంచాలన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో ఆలస్యం జరగకూడదని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో... ప్రీతి సుగాలి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో... తీసుకునే చర్యలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ‘‘ప్రీతి సుగాలి తండ్రికి ఉద్యోగం ఇస్తున్నాం. ప్రీతి తల్లి కోరుకున్నట్లే ఆమెను కర్నూలు డిస్పెన్సరీలోనే కొనసాగిస్తున్నాం. 5 సెంట్ల ఇంటి పట్టా, ఐదెకరాల భూమిని కూడా ఇస్తున్నాం’’ అని ముఖ్యమంత్రికి తెలిపారు.

మరిన్ని వార్తలు