రాజకీయం చేసేందుకేనా అసెంబ్లీ..?

4 Dec, 2020 01:19 IST|Sakshi

ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బలహీనవర్గాలు గుర్తొస్తాయి

హైకోర్టు చెప్పినా 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు

అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమంపై చర్చకు ప్రతిపక్షం నుంచి సలహాలు వస్తాయని చూశామని, ప్రతిపక్షం మాత్రం రాజకీయం చేసేందుకే అసెంబ్లీని ఉపయోగించుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు సంక్షేమ బిల్లులపై చర్చ సందర్భంగా  సీఎం ప్రసంగించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై నిప్పులు చెరిగారు. సభ సజావుగా జరగకుండా అడ్డుకుని సస్పెన్షన్‌ కోరుకున్నారని.. చంద్రబాబుకు పేదల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.79,806 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని దుయ్యబట్టారు. (చదవండి: శాసన మండలిలో శాంతిభద్రతలపై చర్చ)

‘‘ఏడాదికి రూ.15,419 కోట్లు మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేశారు. మేం అధికారంలోకి వచ్చాక కేవలం 18 నెలల్లో రూ.58,729 కోట్లు ఖర్చు చేశాం. ఏడాదికి రూ.39,153 కోట్లు సంక్షేమానికి కేటాయించాం. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బలహీనవర్గాలు గుర్తొస్తాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు బీసీ సబ్‌ప్లాన్‌, బీసీ కార్పొరేషన్లు అన్నారు. 2 నెలల్లో ఎన్నికలొస్తాయనగా పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.2వేలకు పెంచారు. 2018లో హైకోర్టు చెప్పినా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. స్థానిక ఎన్నికలు నిర్వహించి ఉంటే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ వచ్చేది. 59.85 శాతం రిజర్వేషన్లతో 2019లో ఎన్నికలకు వెళ్లాం. చంద్రబాబు టీడీపీకి చెందిన ప్రతాప్‌రెడ్డితో రిజర్వేషన్లపై కేసు వేయించారు. టీడీపీ వేసిన కేసుల వల్ల 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చంద్రబాబు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. మేం అధికారంలోకి వచ్చాక బకాయిలు చెల్లించడంతో పాటు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నాం. నేరుగా తల్లుల అకౌంట్‌కే డబ్బు జమ చేస్తున్నామని’’ సీఎం తెలిపారు.(చదవండి: నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక)

చంద్రబాబు కావాలనే నిర్వీర్యం చేశారు..
2016 నుంచి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం నిలిపేశారని, దీంతో మహిళలపై రూ.3,036 కోట్ల భారం పడిందని సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. మేం అధికారంలోకి వచ్చాక 2019-20 సున్నా వడ్డీ కింద రూ.1,400 కోట్లు ఇచ్చామని తెలిపారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద తల్లులకు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు.దీని కోసం ఏడాదికి రూ.1900 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పరిస్థితి లేదని, ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు కావాలనే నిర్వీర్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

కనీసం పుస్తకాలు కూడా ఇవ్వలేదు...
‘‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు కనీసం పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ప్రైవేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టలేదు. నాడు-నేడు ద్వారా 45వేల పాఠశాలలను రూ.10వేల కోట్లతో పునరుద్ధరిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు యూనిఫామ్‌, పుస్తకాలతో పాటు మంచి మెనూతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందేలా సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాం. 42.33లక్షల మందికి అమ్మఒడి పథకం కింద రూ.6,349 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ చేయూత, కాపు నేస్తం ద్వారా నేరుగా మహిళల ఖాతాలకే నగదు జమ చేస్తున్నాం. దళారులు లేకుండానే సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

వైఎస్సార్‌ పెన్షన్ కింద రూ.23వేల కోట్లు..
‘‘62లక్షల మందికి వైఎస్సార్‌ పెన్షన్ కింద రూ.23వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 50.60లక్షల మందికి వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.11,324 కోట్లు అందిస్తున్నాం. 18.52లక్షల మందికి విద్యాదీవెన కింద రూ.3,857 కోట్లు అందిస్తున్నాం. 2.74లక్షల మందికి వైఎస్సార్‌ వాహనమిత్ర కింద రూ.513 కోట్లు అందించాం. 81,703 మందికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ.383 కోట్లు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు 16,725 యూనిట్లకు రూ.904 కోట్లు అందించాం.14.58లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ కింద రూ.1,073 కోట్ల రుణాలు ఇచ్చాం. 5.65 కోట్ల మందికి రూ.77,731 కోట్ల సంక్షేమ పథకాలు అందించాం.

బలహీనవర్గాలకు నాలుగు డిప్యూటీ సీఎం పదవులు.. 
మంత్రి పదవుల్లో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాం. నాలుగు డిప్యూటీ సీఎం పదవులు బలహీనవర్గాలకే కేటాయించాం. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా 43వేల బెల్ట్‌షాపులు రద్దు చేశాం. 33శాతం మద్యం దుకాణాలను తగ్గించాం. రాత్రి 8 గంటలకే మద్యం షాపులు మూసివేసేలా చర్యలు తీసుకున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా