వాలంటీర్లు బాగా పనిచేశారు.. సీఎం జగన్‌తో వరద బాధితులు

26 Jul, 2022 14:38 IST|Sakshi

సాక్షి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: వరద నష్టంపై అంచనాలు పూర్తికాగానే ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తామని తెలిపారు. గతంలో ఏనాడూ లేని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను నేరుగా కలిసి పరామర్శించారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.

శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను సీఎం అడిగారు. శిబిరాల్లో తమను బాగా చూసుకున్నారని వరద బాధితులు సీఎం జగన్‌కు తెలిపారు. వాలంటీర్లు బాగా పనిచేశారని అన్నారు. మీ కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చని గ్రామస్తులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరదలు రాగానే ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తక్షణ సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. వెంటనే అధికారులందరినీ క్షేత్రస్థాయిలోకి పంపామని, ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు.
చదవండి: వరద బాధితులందరికీ అండగా ఉంటాం: సీఎం జగన్‌

>
మరిన్ని వార్తలు