హమాస్ సొరంగాలకు కృత్రిమ వరద..? ఇజ్రాయెల్ సరికొత్త వ్యూహం!

5 Dec, 2023 16:21 IST|Sakshi

టెల్ అవీవ్: హమాస్ అంతమే ధ్యేయంగా ముందుకు కదులుతున్న ఇజ్రాయెల్ మరో కీలక ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. సొరంగాల్లో నక్కిన హమాస్ దళాలను బయటకు రప్పించడానికి కృత్రిమ వరదను సృష్టించనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలకు సైన్యం నీటి పంపులను తరలిస్తున్నట్లు సమాచారం. సొరంగాలను నీటితో నింపితే ప్రాణ రక్షణ కోసం ఉగ్రవాదులు బయటకు వస్తారని (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ఐడీఎఫ్  వ్యూహ రచన చేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. 

ఆల్-షతీ శరణార్థి క్యాంపుకు ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ ఐదు భారీ పంపులను  నవంబర్ ప్రారంభంలోనే  ఏర్పాటు చేసింది. గంటకు వేల క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యమున్న భారీ పంపులను సైన్యం తరలించింది. వీటితో కొన్ని వారాల్లోనే సొరంగాలన్నింటినీ నీటితో నింపేయవచ్చు. బందీల విడుదల ప్రక్రియ పూర్తైన తర్వాత ఐడీఎఫ్ ఈ వరద ఎత్తుగడను ఉపయోగిస్తుందా..? లేక అంతకు ముందే నీటిని విడుదల చేస్తుందా? అనే అంశం ప్రస్తుతానికి తెలియదు. 

మరోవైపు బంధీలను సురక్షిత ప్రాంతంలో ఉంచామని హమాస్ ఇప్పటికే ప్రకటించింది.  హమాస్‌ను అంతం చేయడానికి ఇజ్రాయెల్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఐడీఎఫ్ మిలిటరీ, టెక్నికల్‌గా అన్ని దారుల్లో ముందుకు వెళుతోంది. కాల్పుల విరమణ తర్వాత భూతల దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్.. సరికొత్త యుద్ధ తంత్రాలను ఉపయోగిస్తోంది.  

అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట హమాస్ దాడుల్ని ప్రారంభించినా.. ఇజ్రాయెల్ తేరుకుని చావు దెబ్బ కొడుతోంది. అధునాతన ఆయుధాలతో గాజాపై విరుచుకుపడుతోంది. బాంబుల మోతతో గాజా అంతటా విలయం తాండవం చేస్తోంది. ఇప్పటికే గాజాలో 12 వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైపు 1400 మంది చనిపోయారు. ఇటీవల నాలుగు రోజులు కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. కానీ గడువు ముగియగానే మళ్లీ యుద్ధం ప్రారంభించారు. 

ఇదీ చదవండి: విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

>
మరిన్ని వార్తలు